ఏపీలో అందరికి నాణ్యమైన వైద్య సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీమా విధానంలో ఆరోగ్య శ్రీ సేవల్ని అందించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతి కుటుంబానికి రూ.25లక్షల విలువైన ఆరోగ్య సేవల్ని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.
ఏపీలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీపీఎల్ కుటుంబాలతో పాటు ఏపీఎల్ కుటుంబాలకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవను విస్తరించనున్నారు.
బీమా విధానంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య సేవల్ని అందించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ తయారు చేసిన ముసాయిదాపై సాధ్యాసాధ్యాలను ఆర్ధికశాఖ అధ్యయనం చేస్తోంది.
ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ముసాయిదాను రూపొందించారు. ఏపీలో ప్రస్తుతం1.43 కోట్ల కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నాయి. వీరందరికి ఉచితంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ స్కీమ్ వర్తిస్తోంది. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న ప్రైవేట్ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులైన దాదాపు 19-20 లక్షల కుటుంబాల వారికి ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఇవ్వడం లేదు. ఇకపై వారికి కూడా షరతులు ఏమీ లేకుండా బీమా పథకాన్ని వర్తింపజేస్తారు.
కొత్త పథకంలో ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.2.5 లక్షల విలువైన వైద్య సేవలు ఉచితంగా బీమా సంస్థల ద్వారా అందిస్తారు. అంతకు మించి ఖరీదు చేసే చికిత్సలకు రూ.25 లక్షల వరకు అయ్యే ఖర్చును హైబ్రిడ్ విధానంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా చెల్లిస్తారు.
ఏపీలోని 26 జిల్లాలను రెండు జోన్లుగా విభజించి, టెండర్ల ద్వారా బీమా కంపెనీలను ఎంపిక చేసి ఈ పథకాన్ని అమలు చేస్తారు. ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డులున్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా ప్రస్తుతం ఏడాదికి రూ. 25 లక్షల విలువైన చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారు.
ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా 2,250, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు పరిధిలో 770 చికిత్సలు అందిస్తున్నారు. ఆరోగ్య శ్రీలో 30 రకాల స్పెషాలిటీలతో కలిపి 3,257 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కొత్త విధానంలో బీమా విధానంలో 2250 చికిత్సలు, ట్రస్టు ద్వారా మిగిలిన 770 చికిత్సలను అందిస్తారు. వైద్య సేవ ట్రస్ట్ అందించే 770 చికిత్సలు ముఖ్యమైనవి కాకపోవడంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకోడానికి బీమాద్వారా అందించే చికిత్సలకు పరిధి విధించారు.
పూర్తి స్థాయిలో పరిశీలనతో పాటు ఆస్పత్రుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయి. మరోవైపు బీమా విధానంలో చికిత్సలు అందించడంపై నెట్‌వర్క్ ఆస్పత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆరోగ్య శ్రీచికిత్సల ధరలను సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఆర్థిక శాఖ అధ్యయనం తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం లభిస్తే బీమా సేవల్ని అందించేందుకు టెండర్లను ఆహ్వానించాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది.
సంబంధిత కథనం