Apsrtc Bus accident: డ్రైవర్ అనుభవ రాహిత్యం, అధికారుల నిర్లక్ష్యమే అసలు కారణం
Apsrtc Bus accident: అనుభవం లేని డ్రైవర్‌కు ఆటోమెటిక్ బస్సును అప్పగించడమే విజయవాడ బస్టాండ్‌లో ఘోర ప్రమాదానికి కారణమైంది. ముగ్గురు ప్రాణాలను బలిగొన్న ఘటనపై విచారణ కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని సిఫార్సు చేశారు.
Apsrtc Bus accident: డ్రైవర్ అనుభవ రాహిత్యం విజయవాడ బస్టాండ్‌లో ఓల్వో బస్సు దూసుకెళ్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోడానికి కారణమైంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు ఆర్టీసీ విచారణ కమిటీ నివేదికలో వెల్లడైంది. మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేసే డ్రైవర్‌కు ఏ మాత్రం అనుభవం లేకున్నా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న ఓల్వో బస్సును అప్పగించడంతో ఘోర ప్రమాదానికి దారి తీసింది.
విజయవాడ బస్టాండ్‌లో గుంటూరు-విజయవాడ మెట్రో లగ్జరీ బస్సు దూసుకు పోయిన ఘటనలో డ్రైవర్ ఏమరపాటు, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలింది. బస్సులో సాంకేతికంగా ఎలాంటి లోపాలు లేవని డ్రైవర్ డ్రైవ్ మోడ్‌లో ఉండగానే రివర్స్ చేసేందుకు యాక్సిలరేట్ చేయడంతో ముందుకు దూసుకు పోయినట్లు గుర్తించారు. బస్సును వెనక్కి వెళ్లాల్సి ఉండగా డ్రైవ్ మోడ్‌లో ముందుకు దూసుకుపోయింది.
ఆర్టీసీ దూర ప్రాంత సర్వీసులకు లగ్జరీ బస్ డ్రైవర్‌గా ఉన్న వి.ప్రకాశంకు ఇటీవల మెట్రో లగ్జరీ వోల్వో బస్సులో విధులు అప్పగించారు. ఓల్వో బస్సు నడపడంపై అవగాహన లేకపోయినా విజయవాడ-గుంటూరు ఇంటర్ సిటీ సర్వీసును అప్పగించారు. బస్టాండ్ నుంచి బయటకు వెళ్లే క్రమంలో రివర్స్ చేయాలనుకుని సాధారణ బస్సుల మాదిరి గేర్ షిఫ్ట్ చేస్తూ డ్రైవ్ మోడ్‌లోనే వెనక్కి నడపడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు.
డ్రైవర్ బస్సును వెనక్కి నడుపుతున్నాడనే భ్రమలో యాక్సిలరేట్ చేసినట్టు చెబుతున్నారు. బస్సు ముందుకు వెళుతున్నట్లు గుర్తించే లోపు సెకన్ల వ్యవధిలో ఘెర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఔట్ సోర్సింగ్ కండక్టర్‌తో పాటు ఓ మహిళ, ఏడు నెలల చిన్నారి చనిపోయారు.
మరోవైపు విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన ఓల్వో బస్సు ప్రమాదంపై నియమించిన విచారణ కమిటీ నివేదిక సమర్పించింది. ప్రమాద కారణాలపై రవాణాశాఖ అధికారుల బృందం విచారణలో డ్రైవర్ కు సరైన శిక్షణ ఇవ్వలేదని తేల్చారు. డ్రైవర్ కు ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ పై అవగాహన లేదని దర్యాప్తులో వెల్లడైంది. ప్రత్యేక శిక్షణతోనే ఓల్వో బస్సు నడపాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. నివేదికలోని అంశాలపై ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఎండీ సమీక్ష నిర్వహించారు. పోలీసులు, అధికారుల దర్యాప్తు ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.
మంగళవారం ఉదయం విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మెట్రో లగ్జరీ ఓల్వో బస్సును డ్రైవర్ వి.ప్రకాశం నడుపుతున్నారు. బస్టాండ్ నుంచి బయల్దేరే సమయంలో రివర్స్ గేర్ వేసే క్రమంలో డ్రైవ్ మోడ్‌లో ఉంచడంతో ప్రమాదం జరిగింది. ముగ్గురు చనిపోవడానికి కారణమైన డ్రైవర్‌పై క్రమశిక్షణ చర్యలతో పాటు కఠిన శిక్షలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది.
అనుభవం లేని డ్రైవర్‌కు విధులు అప్పగించిన ఆటోనగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్ వివి.లక్ష్మీపై సస్పెన్షన్ వేటు వేశారు. శాఖపరమైన విచారణకు ఆదేశించారు. సిబ్బంది విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆటోనగర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు…
విజయవాడ బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, ఎక్స్‌గ్రేషియా అందేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ సెంట్రల్ తహసీల్దార్ వెన్నెల శ్రీను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
మృతురాలు మోతాని కుమారి కుమారుడు కిశోర్‌బాబుకు క్లాస్-4 ఉద్యోగమివ్వాలని ప్రతిపాదించారు. చనిపోయిన మరో చిన్నారి అయాన్ తండ్రి ఎలిషాను ప్రభుత్వ డ్రైవర్‌గా మార్చాలని సిఫార్సు చేశారు. చిన్నారి తండ్రి ప్రస్తుతం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వద్ద ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆర్టీసీలోనే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న బుకింగ్ క్లర్క్ యడ్లపల్లి వీరయ్య సోదరీమణులు స్వప్న, విజయరాణిలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని సిఫార్సు చేశారు.