Telugu News  /  Andhra Pradesh  /  Indrakeeladri Day 07 Saraswati Devi On Mula Nakshatram
సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు

Indrakeeladri Day 07 Saraswati Devi : సరస్వతీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ

02 October 2022, 5:38 ISTB.S.Chandra
02 October 2022, 5:38 IST

Indrakeeladri Day 07 Saraswati Devi అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజు కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచి ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శించే అమ్మవారి కృపాకటాక్షాల కోసం వేల మంది భక్తులు శనివారం పొద్దుపోయాక కొండకు చేరుకున్నారు. భక్తుల రద్దీతో వేకువ జామున 1.30 నుంచి దర్శనాలు ప్రారంభించారు.

Indrakeeladri Day 07 Saraswati Devi శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ 7వ రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ స‌ప్త‌మి ఆదివారంనాడు స‌ర‌స్వ‌తీ దేవిగా ద‌ర్శ‌న‌మిస్తున్నారు. చదువుల తల్లి సరస్వతి దేవి. మానవులకు సకల విద్యల్ని ప్రసాదించి వారిలో జ్ఞాన దీపాన్ని వెలిగించే విద్యాశక్తి సరస్వతి. త్రిశక్తుల్లో మహాశక్తి అయిన సరస్వతి దేవి.

ట్రెండింగ్ వార్తలు

"చింతా మణి జ్ఞాన నీల ఘటకిణ్యంతరిక్షత: మహత్పూర్వాశ్చ సక్తైవాస్సరస్వత: ప్రకీర్తిత: " అని అమ్మవారిని కీర్తిస్తారు.

చింతామణి, సరస్వతి, జ్ఞానసరస్వతి, నీలసరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి,అంతరిక్ష సరస్వతి, మహా సరస్వతి అని ఏడు రూపాల్లో మేరుతంత్రంలో పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి సరస్వతి అలంకారంలో ఎందుకు దర్శనిమస్తుందంటే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా, అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమమ్మ, చాలపెద్దమ్మ, సురారులమ్మ, దుర్గమాయమ్మ అని పోతానామాత్యుడి చేత కీర్తించబడింది.

ఈ త్రిశక్తులు మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి అని మూడు విధాలుగా ఉంటుంది. త్రిశక్తుల్లో ఒకటైన మహా సరస్వతి దేవి శుంభనిశుంభులనే రాక్షసుల్ని వధించింది. అందుకు గుర్తుగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. దసరాలో అమ్మవారికి చేసే అన్ని అలంకారాల్లో సరస్వతీదేవి అలంకారానికి ప్రాధాన్యత ఉంది. అమ్మవారి మూలా నక్షత్రం రోజు ఈ అలంకరణ చేస్తారు.

“సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ”

నీహార హార ఘనసార సుధాకరాభాం

కళ్యాణదాం కనక చంపక దామభూషాం

ఉత్తుంగ పీనకుచ కుంభమనోహరాంగీం

వాణీం నమామి మనసావచసాం విభూత్యై

ఓం శ్రీ సరస్వతీదేవతాయై నమ:" అని అమ్మవారిని ప్రార్ధించాలి

అమ్మ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్ర‌మైన మూలా న‌క్ష‌త్రానికి శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో ఎంతో విశిష్ట‌త ఉంది. అందుకే ఆశ్వ‌యుజ శుద్ధ స‌ప్త‌మినాడు చ‌దువుల త‌ల్లిగా కొలువుదీరే దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తుతారు. త్రిశ‌క్తి స్వ‌రూపిణీ నిజ స్వ‌రూపాన్ని సాక్ష‌త్కారింప‌జేస్తూ శ్వేత‌ప‌ద్మాన్ని అధిష్టించిన దుర్గామాత తెలుపు రంగు చీర‌లో బంగారు వీణ‌, దండ‌, క‌మండ‌లం ధ‌రించి అభ‌య‌ముల‌తో స‌ర‌స్వ‌తీ దేవిగా భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తుంది. ఈ రోజున అమ్మ‌వారికి గారెలు, పూర్ణాలు నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు.

ఇంద్రకీలాద్రి పై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు శనివారం రాత్రి 11గంటల సమయంలోను భారీగా భక్తులు తరలివచ్చారు. రాత్రి 11.40 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతించారు. రాత్రి 11.40 గంటల అనంతరం దర్శనాలు నిలిపివేశారు. రాజగోపురం వద్ద ఉన్న భక్తులను వెనక్కి పంపడంతో పోలీసులు, భక్తుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

మూలా నక్షత్రం సందర్భంగా రాత్రి 1.30 గంటల నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం ప్రారంభించారు. ఆదివారం కావడంతో రెండున్నర లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందన్నారు. రూ.100, రూ.300, రూ.500 రూపాయల దర్శనం టికెట్స్ విక్రయాలు నిలిపివేశారు. రద్దీ కారణంగా వృద్ధులు, వికలాంగులకు ఏవిధమైన ఏర్పాట్లు చేయడం లేదని కలెక్టర్‌ ఢిల్లీరావు పేర్కొన్నారు.

దుర్గమ్మ చినజీయర్ సారె…..

ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువున్న జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు త్రిదండి చిన్న జీయర్ స్వామి శ‌నివారం సారె స‌మ‌ర్పించారు. అమ్మవారికి సారె సమర్పించిన అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వ‌ద్ద చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ అమ్మవారికి సారెను సమర్పించడం ఆన‌వాయితీగా వస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మ‌వారిని కోరుకున్న‌ట్లు చెప్పారు.

నేడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సిఎం

శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టువస్త్రాలు అందజేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి 3.30 గంటల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది దుర్గగుడి కి చేరుకుని ట్రయల్ రన్ నిర్వహించారు. భద్రతా చర్యలపై పోలీసులకు అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

టాపిక్