TTD Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 24 గంటలు, నేడు ఆగస్టు కోటా రూ.300టిక్కెట్ల విడుదల-increased rush of devotees in tirumala 24 hours for sarvadarshan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 24 గంటలు, నేడు ఆగస్టు కోటా రూ.300టిక్కెట్ల విడుదల

TTD Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 24 గంటలు, నేడు ఆగస్టు కోటా రూ.300టిక్కెట్ల విడుదల

Sarath chandra.B HT Telugu
May 24, 2024 11:38 AM IST

TTD Updates: వేసవి సెలవులు, పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెలువడటంతో తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

TTD Updates: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి ఒక్కసారిగా భక్తులు పెరిగారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెలువడటంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనం కోసం 24గంటల సమయం పడుతోంది.

టైమ్‌ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు లేకుండా వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోయింది. గురువారం సాయం త్రం క్యూలైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూలైన్లు నిండిపోవడంతో నారాయణ గిరి షెడ్లు నిండిపోయి రింగురోడ్డులోని బాటగంగమ్మ ఆలయం వరకు భక్తులు బారులు తీరారు. భక్తులకు 24 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తుందని టీటీడీ తెలిపింది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.

గురువారం రాత్రికి భారీగా భక్తులు వేచి ఉండటంతో కొత్తగా భక్తుల్ని క్యూలైన్లలోకి అనుమతించడం లేదు. శుక్రవారం తెల్లవారుజామున ఆరింటి క్యూలైన్లలోకి రావాలని భక్తులకు టీటీడీ సూచించింది. క్యూలైన్లకు వచ్చే భక్తులు బస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. విద్యార్థులకు వేసవి సెలవులతో పాటు వారాంతంలో వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది.

మరోవైపు ఆగస్టు నెల కోటాకు సంబంధించి రూ.300 తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల టీటీడీ విడుదల చేసింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. భక్తులు www.ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు. వసతి గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

గురువారం తిరుమల శ్రీవారిని 65,416మంది దర్శించుకన్నారు. 36,128మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా రూ.3.51కోట్లు లభించాయి. సర్వదర్శనం టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనం కోసం 24గంటల సమయం పడుతోంది.

వైభవంగా గోవిందుడి రథోత్సవం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.35 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు.

ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో తత్త్వజ్ఞానమిదేనని పండితులు వివరించారు.

అనంతరం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి, న‌మ్మాళ్వార్ల‌ వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు.

సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌సేవ జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. నం :

శ్రీ గోవింద‌రాజ‌స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 24న శుక్ర‌వారం ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు కపిలతీర్థం (ఆళ్వార్ తీర్థం)లో చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఇందుకోసం ఉదయం 4.30 గంటలకు స్వామి, అమ్మ‌వార్లు తిరుచ్చిపై, చ‌క్ర‌తాళ్వార్ పల్లకీలో కపిలతీర్థానికి ఊరేగింపుగా బయల్దేరారు. చక్రస్నానం అనంతరం పిఆర్‌.తోటకు వేంచేపు చేసి సాయంత్రం 6 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజు గురువారం ఉదయం స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. ఆలయంలో ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణరథంపై ఆశీనురాలిని చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024