Rice Prices Reduced: రైతు బజార్లలో కిలో రూ.49కే బియ్యం, రూ.160కు కందిపప్పు.. గురువారం నుంచి విక్రయాలు…-in rythu bazars rice is priced at rs 49 per kg and pulses at rs 160 sales from thursday ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rice Prices Reduced: రైతు బజార్లలో కిలో రూ.49కే బియ్యం, రూ.160కు కందిపప్పు.. గురువారం నుంచి విక్రయాలు…

Rice Prices Reduced: రైతు బజార్లలో కిలో రూ.49కే బియ్యం, రూ.160కు కందిపప్పు.. గురువారం నుంచి విక్రయాలు…

Sarath chandra.B HT Telugu
Jul 09, 2024 06:00 AM IST

Rice Prices Reduced: ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నినిత్యావసర వస్తువుల ధరల్ని కొంతైనా తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌరసరఫరాల వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు చేపట్టింది.

మిల్లర్లతో చర్చిస్తున్న సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
మిల్లర్లతో చర్చిస్తున్న సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

Rice Prices Reduced: చుక్కలనంటుతున్న బియ్యం, కందిపప్పు ధరల్ని నేలకు దించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత కొద్ది నెలలుగా పెరుగుతోన్న ధరల్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఓ వైపు వేల కోట్ల రుపాయలు వెచ్చించి పౌరసరఫరాల శాఖ ద్వారా ఇంటంటికి చౌక ధరలతో బియ్యం సరఫరా చేస్తున్నా బహిరంగ మార్కెట్లో మాత్రం నాణ్యమైన బియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో బియ్యం ధరల పెరుగుదల, మిల్లర్ల చర్యలపై హిందుస్తాన్ టైమ్స్‌ పలుమార్లు వరుస కథనాలు ప్రచురించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది.

గత ఏడాది మిగ్‌జామ్‌ తుఫాను సమయం నుంచి బియ్యం ధరల్ని కృత్రిమంగా పెంచుకుంటూ పోయారు. 26కేజీల బస్తా ధర రూ.1600 దాటేసింది. రిటైల్ మార్కెట్‌లో కిలో ధర రూ.70కు చేరువైంది. ఇదే పరిస్థితి కొనసాగితే కిలో ధరను రూ.100కు స్థిరీకరిస్తారని జనం బెంబేలెత్తిపోయారు. బియ్యం ధరల కట్టడి విషయంలో వైసీపీ ఏ మాత్రం శ్రద్ధ చూపకపోవడం ఆ పార్టీని నిలువున ముంచేసింది. వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలు ఎంత మొత్తుకున్నా మొద్దు నిద్ర నటించారు. ఏపీలో బియ్యం ధరలు పెంచాల్సిన అవసరమే లేకపోయినా బహిరంగ దోపిడీకి సహకరించారు.

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో పౌరసరఫరాల వ్యవస్థను ప్రక్షాళన చేసే చర్యలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు, బియ్యం విక్రయించాలని నిర్ణయించారు. గురువారం నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు జరుపనున్నారు.

నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లలో విక్రయిస్తారని రాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్ సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో శ్రీ మనోహర్ ధరల స్థిరీకరణ, నియంత్రణ గురించి విస్తృతంగా చర్చించారు.

రాష్ట్రంలో నిత్యావసర సరకులను ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంచడం, వారికి ఉపశమనం కలిగించడం అవసరమని మనోహర్ మిల్లర్లకు తేల్చి చెప్పారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.181 ఉన్న కందిపప్పు రూ.160, బియ్యం రూ.52.40 ఉంటే రూ.48కీ, స్టీమ్డ్ బియ్యం రూ.55.85 ఉంటే రూ.49 చొప్పున విక్రయిస్తారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం తగ్గించిన ధరలకు విక్రయించాలని నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ కమిషనర్ సిద్దార్థ్ జైన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎమ్.డి. వీరపాండ్యన్ పాల్గొన్నారు.

మార్కెట్లో ధరల్ని స్థిరీకరించాల్సిందే…

నిత్యావసర వస్తువుల ధరల క్రమబద్దీకరణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమే అయినా బియ్యం, పప్పు ధాన్యాలు, వంట నూనెల ధరల విషయంలో స్థిరీకరణ ప్రభుత్వానికి మేలు చేస్తుంది. సంక్షేమ పథకాల అమలు కంటే ప్రజలపై భారాన్ని తగ్గించే చర్యలే ఎక్కువగా వారికి మేలు చేస్తాయి. ధరల్ని నిర్దిష్ట ధరల కంటే అదనంగా విక్రయించకుండా కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

పేదలకు అందించే రేషన్ బియ్యం కూడా రైతుల నుంచి సేకరించిన ధాన్యమే. కనీస మద్దతు ధరతో వాటిని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజలకు చౌక ధరలతో అందించేందుకు సగటున కిలోకు రూ.42వరకు ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలకు కనీస ధరలకే బియ్యం, ధాన్యాలు, నూనెలు అందుబాటులోకి తీసుకు వస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేసినది అవుతుంది.

Nadendla manohar, Rice Price, CivilSupplies, Paddy, Oils, వంటనూనెలు, బియ్యం ధరలు, రైతు బజార్లు, ధరల నియంత్రణ, రూ.49కే బియ్యం, స్టీమ్డ్ బియ్యం

Whats_app_banner

సంబంధిత కథనం