AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.
AP Welfare pensions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్దిదారులకు అందించే పెన్షన్ల పంపిణీలో 96.67శాతం పంపిణీ పూర్తైందని ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన వారికి ఇంటింటి పంపిణీ చేయనున్నారు.

AP Welfare pensions: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాల ద్వారా సామాజిక పెన్షన్లు అందుకుంటున్న లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ 96.67శాతం పూర్తైందని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. మరోవైపు డిబిటి పథకాన్ని బ్యాంకు ఖాతాల్లో వేయడంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు వాటిని తమ ఫీజుల్లో జమ చేసుకున్న ఉదంతాలు వెలుగు చూశాయి.
రాష్ట్రంలోని 65,49,864 మంది పెన్షనర్లకు.. సంక్షేమ పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదల చేసింది. మే 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. గురువారం సాయంత్రానికి 63,31,470 పింఛన్లు పంపిణీ చేశారు. మొత్తం లబ్దిదారుల్లో 96.67 % మందికి పెన్షన్లను పంపిణీ చేశారు.
మే నెలలో పింఛన్ల చెల్లింపు కోసం ఏపీ ప్రభుత్వం రూ.1,945 కోట్లు విడుదల చేసిందని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తెలిపారు. మొత్తం 65,49,864 మంది పింఛను లబ్దిదారుల్లో 63,31,470 మందికి పంపిణీ పూర్తయ్యింది.
15,13,752 మందికి ఇంటింటికీ వెళ్లి ఇవ్వగా.. మరో 48,17,718 మందికి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. 74,399 మంది బ్యాంకు ఖాతాలకు మొబైల్ అనుసంధానం కాకపోవడం వల్ల డబ్బులు జమ చేయడం సాధ్యం కాలేదన్నారు. నగదు బదిలీ కాని వారందరికి మే 4న ఇంటింటికీ వెళ్లి పింఛను అందిస్తామని శశిభూషణ్ తెలిపారు.
డోర్ టు డోర్ పంపిణీ:
ఈసీ మార్గదర్శకాల ప్రకారం వృద్ధులు, వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దనే పెన్షన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విభాగంలో ఉన్న మొత్తం 16,57,361 పెన్షన్లలో 15,13,752 పింఛన్లు (91.34 %) పంపిణీ చేశామని అధికారులు తెలిపారు.
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) మోడ్:
ప్రభుత్వ పెన్షన్‌దారుల్లో బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి నేరుగా నగదు బదిలీ చేశారు. 48,92,503 పింఛన్లలో 48,17,718 పింఛన్లు (98.47 %) పంపిణీ చేశారు. అయితే కొన్ని లావాదేవీలు ఫెయిల్ అయ్యాయని గుర్తించారు. వారికి ఇంటి వద్దే పెన్షన్లు చెల్లించాలని నిర్ణయించారు.
బ్యాంకు ఫీజులకు జమ…
రాష్ట్ర ప్రభుత్వం డిబిటి పథకంలో భాగంగా విడుదల చేసిన పెన్షన్ డబ్బును చాలా చోట్ల బ్యాంకులు తమ ఫీజులుగా జమ చేసుకున్నాయి. ఇలాంటి ఉదంతాలు పెద్ద ఎత్తున వెలుగు చూశాయి. లబ్దిదారుల ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ లేదనే సాకుతో బ్యాంకులు ఖాతాల్లో డబ్బు పడగానే వాటిని తమ ఫీజులుగా జమ వేసుకోవడంతో లబ్దిదారులు ఉసురుమన్నారు.
60ఏళ్లకు పైబడిన వారి ఖాతాలను జీరో బ్యాలెన్స్ ఖాతాలుగా మార్చకుండా వదిలేయడంతో ఈ సమస్య తలెత్తిందని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. ఖాతాదారులు కేవైసీలు అప్డేట్ చేయకపోవడం, జీరో బ్యాలెన్స్‌కు మార్చుకోకపోవడంతో ఛార్జీలు పడతాయని వివరించారు. పెన్షన్ ఖాతాలపై రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సర్క్యులర్లు తమకు రాలేదని తెలిపారు.
మరోవైపు నిర్వహణలో లేని ఖాతాలకు నగదు బదిలీ జరగలేదు. వినియోగంలో లేని బ్యాంకు ఖాతాలు కూడా భారీగానే ఉన్నాయి. మొబైల్ నంబర్ అనుసంధానం కాకపోవడంతో 74,399 పెన్షన్‌లకు బదిలీ కాలేదు. ఇలా విఫలమైన లావాదేవీల పింఛను దారులకు ఇంటంటికి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
విఫలమైన లావాదేవీలకు అవసరమైన నిధులు మే 3న సంబంధిత గ్రామ/వార్డు సెక్రటేరియట్‌లకు అందుబాటులో ఉంచి మే 4న ఇంటింటికీ పంపిణీ చేస్తారు.
సంబంధిత కథనం