Parliamentary Committee : పార్లమెంటరీ కమిటీల్లో ఏపీ, తెలంగాణ ఎంపీలకు చోటు.. ఎవరు ఏ కమిటీలో ఉన్నారు?
Parliamentary Committee : పార్లమెంటరీ కమిటీల్లో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలకు చోటు లభించింది. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా శ్రీనివాసులు రెడ్డి (టీడీపీ), రైల్వే కమిటీ ఛైర్మన్ సీఎం రమేష్ (బీజేపీ)ని నియమించారు. ఈ మేరకు బులెటిన్ విడుదల అయ్యింది.
లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్.. తాజాగా బులెటిన్ విడుదల చేశారు. దీని ప్రకారం.. ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలు కీలక కమిటీల్లో నియమితులయ్యారు. రవాణా, పర్యాటకం ,సాంస్కృతికం కమిటీ ఛైర్మన్‌గా ఉన్న వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి.. ఇప్పుడు ఆ కమిటీలో సభ్యుడి స్థానానికే పరిమితం అయ్యారు.
కమిటీ సభ్యులుగా ఏపీ ఎంపీలు..
పార్లమెంటరీ కమిటీల్లో 15 మంది టీడీపీ ఎంపీలకు, 11 మంది వైసీపీ ఎంపీలకు, మూడు కమిటీల్లో జనసేన ఎంపీలకు, రెండు కమిటీల్లో బీజేపీ ఎంపీలకు, ఒక కమిటీలో నామినేటెడ్ ఎంపీకి స్థానం దక్కింది.
ఆర్థిక కమిటీ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, పివి మిథున్ రెడ్డి (వైసీపీ), లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (టీడీపీ), సీఎం రమేష్ (బీజేపీ), వల్లభనేని బాలశౌరి (జనసేన)కి అవకాశం దక్కింది.
హోం వ్యవహారాల కమిటీలో కేశినేని శివనాథ్, తెన్నేటి కృష్ణ ప్రసాద్ (టీడీపీ), రక్షణ శాఖ కమిటీలో కేశినేని శివనాథ్ (టీడీపీ), విదేశాంగ వ్యవహారాల కమిటీ సభ్యులుగా వైఎస్ అవినాష్ రెడ్డి (వైసీపీ), గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల కమిటీ సభ్యులుగా ఆళ్ల అయోధ్యరామి రెడ్డి, గుమ్మ తనూజారాణి (వైసీపీ)ని నియమించారు.
పెట్రోలియం, సహజవాయువులు కమిటీ సభ్యులుగా మద్దిల గురుమూర్తి (వైసీపీ), పుట్టా మహేష్ కుమార్ (టీడీపీ), వల్లభనేని బాలశౌరి (జనసేన), కామర్స్ కమిటీ సభ్యులుగా శ్రీభరత్ (టీడీపీ), ఆరోగ్యం, కుటంబ సంక్షేమం కమిటీ సభ్యులుగా బి.పార్థసారథి రెడ్డి, బైరెడ్డి శబరి (టీడీపీ), పరిశ్రమల కమిటీ సభ్యుడిగా గొల్ల బాబూరావు (వైసీపీ)కి అవకాశం దక్కింది.
విద్య, మహిళా, చిల్డ్రన్, యూత్, స్పోర్ట్స్ కమిటీలో దగ్గుపాటి పురందేశ్వరి (బీజేపీ), శాస్త్ర, సాంకేతిక, అటవీ, పర్యావరణ కమిటీ సభ్యులుగా పరిమళ్ నత్వాని (వైసీపీ), రవాణా, పర్యాటకం,సాంస్కృతికం కమిటీ సభ్యులుగా వి.విజయసాయి రెడ్డి (వైసీపీ), టి.ఉదయ్ శ్రీనివాస్ (జనసేన), ఎరువులు, రసాయనం కమిటీ సభ్యులుగా దగ్గుమళ్ల ప్రసాదరావు (టీడీపీ), మేడా రఘునాథ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ (వైసీపీ)ని నియమించారు.
బొగ్గు, గనులు, ఉక్కు కమిటీ సభ్యులుగా బికె పార్థసారథి (టీడీపీ), కమ్యూనికేషన్లు, ఐటీ కమిటీ సభ్యులుగా కలిశెట్టి అప్పలనాయుడు (టీడీపీ), వి.విజయేంద్రప్రసాద్ (నామినేటెడ్), నిరంజన్ రెడ్డి (వైసీపీ), వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ కమిటీ సభ్యులుగా బసిపాటి నాగరాజు (టీడీపీ), కార్మిక, జౌళి, నైపుణ్యాభివృద్ధి కమిటీ సభ్యులుగా అంబికా లక్ష్మినారాయణ, జీఎం హారీష్ బాలయోగి (టీడీపీ)కి అవకాశం ఇచ్చారు.
కమిటీల్లో తెలంగాణ ఎంపీలు..
పార్లమెంటరీ కమిటీల్లో పదింట్లో కాంగ్రెస్ ఎంపీలకు, ఏడు కమిటీల్లో బీజేపీ ఎంపీలకు, మూడు కమిటీల్లో బీఆర్ఎస్ ఎంపీలకు, ఒక కమిటీలో ఎంఐఎం ఎంపీకి స్థానం దక్కింది.
కామర్స్ కమిటీలో సభ్యులుగా రేణకా చౌదరి (కాంగ్రెస్), ఆరోగ్యం, కుటంబ సంక్షేమం కమిటీ సభ్యులుగా కడియం కావ్య (కాంగ్రెస్), పరిశ్రమల కమిటీ సభ్యులుగా ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరెడ్డి (బీజేపీ), మల్లురవి (కాంగ్రెస్), సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, న్యాయ శాఖ కమిటీ సభ్యులుగా కేఆర్ సురేష్ రెడ్డి (బీఆర్ఎస్), రఘునందన్ రావు (బీజేపీ)ని నియమించారు.
శాస్త్ర, సాంకేతిక, అటవీ, పర్యావరణ కమిటీ సభ్యులుగా డి.దామోదర్ రావు (బీఆర్ఎస్), గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్), రవాణా, పర్యాటకం, సాంస్కృతికం కమిటీ సభ్యులుగా సురేష్ షెట్కర్ (కాంగ్రెస్), ఎరువులు, రసాయనం కమిటీ సభ్యులుగా బలరాం నాయక్ (కాంగ్రెస్), ఈటల రాజేందర్ (బీజేపీ), బొగ్గు, గనులు, ఉక్కు కమిటీ సభ్యులుగా అనిల్ కుమార్ యాదవ్ (కాంగ్రెస్), కమ్యూనికేషన్లు, ఐటీ కమిటీ సభ్యులుగా ఆర్.రఘురామ్ రెడ్డి (కాంగ్రెస్)కు అవకాశం దక్కింది.
ఇంధన కమిటీ సభ్యులుగా కుందూరు రఘువీర్ (కాంగ్రెస్), విదేశాంగ వ్యవహారాల కమిటీ సభ్యులుగా కె.లక్ష్మణ్, డీకే అరుణ (బీజేపీ), అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల కమిటీ సభ్యులుగా చామల కిరణ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్), పెట్రోలియం, సహజవాయువులు కమిటీ సభ్యులుగా వద్దిరాజు రవిచంద్ర (బీఆర్ఎస్), రైల్వే కమిటీ సభ్యులుగా కె.లక్ష్మణ్ (బీజేపీ), సామాజిక న్యాయం, సాధికారత కమిటీ సభ్యులుగా గోడం నగేష్ (బీజేపీ) నియామకం అయ్యారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)