SC Categorisation: ఏపీలో జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు…సుప్రీం తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ యోచన
SC Categorisation: దేశంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా యూనిట్‌గా వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
SC Categorisation: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఊపందుకుంది. 25ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ నిర్ణయం తీవ్ర రాజకీయ అలజడికి కారణమైంది.
రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఏపీలో చేసిన ఏబీసీడీ వర్గీకరణపై అభ్యంతరాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు సైతం పూర్తి స్థాయి కులగణన, సామాజిక అధ్యయనం ఆధారంగా వర్గీకరణ చేయాలని సూచించిన నేపథ్యంలో ఏపీలో జిల్లా యూనిట్ ఆధారంగా వర్గీకరణ చేయాలని భావిస్తోంది.
గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా టీడీపీ అంతర్గత సమావేశాల్లో సైతం పార్టీ ఎస్సీ నేతలకు వర్గీకరణ విషయంలో ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో భిన్నమైన కుల సమీకరణల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. భేటీలో ఇదే నిర్ణయం తీసుకుంది.
జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఆ జిల్లాలో ఎస్సీ ఉప కులాల జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరికీ సమస్యలు ఉండవని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం ఏ జిల్లాలో ఏ ఉప కులం జనాభా ఎంత ఉంటే జనాభా దామాషాలో వారికి రిజర్వేషన్లు లభిస్తాయి.ఈ నిర్ణయానికి పొలిట్‌బ్యూరో ఆమోద ముద్ర వేసింది. సమావేశంలో పాల్గొన్న రెండు దళిత ఉప కులాల నాయకులు దీనిపై స్పందించలేదు.
సమన్యాయం జరిగేలా వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ అంశం పొలిట్ బ్యూరోలో చర్చించారు. జిల్లా యూనిట్‌గా జనాభా ప్రాతిపదికన అమలు చేయాలని అభిప్రాయాలు వ్యక్తం కావడంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ నేతలు తెలిపారు. ఎస్సీల్లో ఏ వర్గం నష్టపోకుండా అందరికీ సమన్యాయం జరిగేలా జాగ్రత్తలు తీసుకుందామని చంద్రబాబు చెప్పారు.
త్వరలో నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయనున్నట్టు పొలిట్ బ్యూరోలో చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామని.. చంద్రబాబు నేతలకు వివరించారు. ప్రభుత్వ పనితీరు మెరుగుపరచడానికి, అన్ని విభాగాలు మరింత సమర్థంగా పనిచేయడానికి, పారదర్శక విధానాల రూపకల్పనలో పార్టీ నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇసుక విక్రయాల్లో జోక్యం వద్దు…
ఏపీలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంలో రాజకీయ నేతలు జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. ట్రాక్టర్లలో తరలించుకోడానికి అనుమతించాలని కొందరు నేతలు కోరడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అమ్మకాలకు ఆస్కారం ఇచ్చే పనులు చేయొద్దని హెచ్చరించారు. సచివాలయాల్లో బుకింగ్ పెట్టే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక తరలింపులో పార్టీ నాయకుల ప్రమేయం ఉండకూడదని.. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు.