AP Schools Holiday : ఏపీకి మళ్లీ వర్ష సూచన, రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు-imd alert another depression in bay of bengal rains collector announced holiday to schools ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Schools Holiday : ఏపీకి మళ్లీ వర్ష సూచన, రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

AP Schools Holiday : ఏపీకి మళ్లీ వర్ష సూచన, రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

Bandaru Satyaprasad HT Telugu
Sep 02, 2024 05:44 PM IST

AP Schools Holiday : ఏపీకి మరోసారి వర్షసూచన చేసింది వాతావరణ శాఖ. సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సూచనలతో కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ఏపీకి మళ్లీ వర్ష సూచన, రేపు ఈ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
ఏపీకి మళ్లీ వర్ష సూచన, రేపు ఈ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

AP Schools Holiday : ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. సెప్టెంబర్‌ 5వ తేదీకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా ఏపీలోని మచిలీపట్నం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో కురుస్తోన్న వర్షాలకు ఏపీలోని చాలా ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కోస్తాంధ్రలో వర్షాలు

రాగల 24 గంటలలో దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలలో, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. విదర్భ, తెలంగాణ మీదుగా వాయుగుండం కొనసాగుతోందని తెలిపింది. రామగుండం పట్టణానికి 135 కిలోమీటర్లు, వాగ్ధాకు 170 కిలోమీటర్లు దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ రాగల 12 గంటలలో మరింత బలహీన పడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

గత 24 గంటల్లో అల్లూరి జిల్లాలోని అరుకులో అత్యధికంగా 3 సెంటిమీటర్ల వర్షపాతం రికార్డైందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి ఈదురుగాలులు గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 55 కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.

గుంటూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో విద్యాసంస్థలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు, వరద ముప్పుతో ముందు జాగ్రత్తగా కలెక్టర్ నాగలక్ష్మి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్ష సూచన ఉన్న మరికొన్ని జిల్లాలలో కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.

పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

పశ్చిమగోదావరి జిల్లాలో వర్షాలు నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లకు మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. సెలవును అమలు చేయని విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ మంగళవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

తెలంగాణలో స్కూళ్లకు సెలవులపై కలెక్టర్లదే నిర్ణయం

వర్షాలు, వరదల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులపై జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలో వరదలతో రూ.5 వేల కోట్ల మేర నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ.2 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లాలో ఎన్నడూ లేని విధంగా 30 సెంటిమీటర్ల వర్షం కురిసిందన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి సాయం అందించేందుకు కృషి చేయాలన్నారు.

సంబంధిత కథనం