కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు తవ్వేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇసుక యథేశ్చగా దోపిడీకి గురవుతోంది. రాజకీయ నాయకులే రీచ్‌లను నిర్వహిస్తుండటంతో.. పోలీసులు, విజిలెన్స్ అధికారులు అటువైపు కనెత్తికూడా చూడని పరిస్థితి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. లారీకి కేవలం 20 టన్నులు మాత్రమే తరలించాలని, అదికూడా పగలు మాత్రమే తీసుకెళ్లాలని ఆదేశించింది. అనుమతి మేరకు మాత్రమే ఇసుకని తవ్వాలని స్పష్టం చేసింది. కానీ.. ఇందులో ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. ముఖ్యంగా కృష్ణా నదికి అప్ స్ట్రీమ్ గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు, డౌన్ స్ట్రీమ్ కృష్ణా జిల్లాలోని రీచ్‌ల్లో ఎక్కడా నిబంధనలు అమలు కాకపోవడం గమనార్హం.
మరోవైపు కృష్ణా నదిలో గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయని.. ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయినా ఇసుక వ్యాపారులకు ఇవేం పట్టవు అన్నట్లు ప్రకృతి వనరులను దోచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు.. లారీకి 20 టన్నులు మాత్రమే లోడ్ చేయాలి. కానీ ప్రస్తుతం కృష్ణా నది పరివాహ ప్రాంతంలో 40 టన్నుల వరకు లోడ్ చేస్తున్నారు. కొన్ని చోట్లు మరో 2, 3 టన్నులు అదనంగా నింపుతున్నారు. అసరమైతే పొక్లెయిన్తో ఇసుకను లారీ లోపలికి కుక్కుతున్నారు.
ఇలా ప్రభుత్వ లెక్కకు మించి.. లారీ సామర్థ్యానికి మించి ఇసుకను బహిరంగంగానే తరలించేస్తున్నారు. భారీ లోడులతో రోడ్లపై లారీలు వెళ్లడం వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. అవనిగడ్డ నుంచి విజయవాడ కరకట్ట వైపు మార్గంలో లారీలు విచ్చలవిడిగా రాకపోకలు సాగించడం వల్ల.. ఆ రోడ్డు పూర్తిగా పాడైపోతుంది. గుంతలు, ధ్వంసమైన రోడ్లతో ఇతర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్నారు.
ఇక పగలు మాత్రమే ఇసుక తరలించాలనే నిబంధన ఉన్నప్పటికీ.. రాత్రి, పగలు 24 గంటలు ఇసుకను తరలిస్తున్న పరిస్థితి. దీనికి తోడు లారీలు పోటా పోటీగా టార్గెట్ పెట్టుకుని మరీ తోలకాలు సాగిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా కంచికచర్ల, నందిగామ నుంచి పెనమలూరు, అవనిగడ్డ వరకు సుమారు 14 ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. అన్ని రీచ్‌ల్లో అనుమతులకు మించి ఇసుకను తవ్వేస్తున్నారు. లోతుగా తవ్వడం వల్ల నదిలో భారీగా గోతులు ఏర్పడుతున్నాయి.
ఇటీవల కృష్ణా జిల్లా పెనమలూరు సమీపంలోని పెదపులిపాక వద్ద కృష్ణా నదిలో ఈతకు వెళ్లి.. అక్కడి సుడిగుండాలలో చిక్కుకుని యువకులు మృతిచెందారు. భారీ గుంతలు ఏర్పడటం వల్లే నదిలో సుడిగుండాలు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గతేడాది కృష్ణా నదికి భారీగా వరదలు వచ్చాయి. దాదాపు 60 వేల మంది నిరాశ్రయులుగా మిగిలారు. నదిలో ఇసుకను లోతుగా తవ్వడం వల్లే నదీ ప్రవాహ దిశ మారుతోందని, దీనివల్లే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
నదీ గర్భంలో లోతుగా ఇసుక తవ్వడం వల్ల.. పంట పొలాలు నిస్సారం అయ్యే ప్రమాదం ఉందని, నదికి సమీప గ్రామాల్లోని బోర్లలో కూడా నీటి లభ్యత ఉండదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇసుక తవ్వకాలు పరిశీలిస్తే.. కృష్ణా నది పూర్తిగా ధ్వంసం అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఈసారి వరదలొస్తే మాత్రం అనేక గ్రామాలు నీటమునిగే ప్రమాదం లేకపోలేదు.
సంబంధిత కథనం