Talliki Vandanam: ఆర్టీఈ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తే తల్లికి వందనం భారం కొంతైనా తగ్గే అవకాశం..
Talliki Vandanam: ఓ వైపు ఆర్థిక సమస్యలు, అంతంతమాత్రంగా ఉన్నఖజానా, మరోవైపు ఎన్నికల హామీలు, సూపర్ సిక్స్ గ్యారంటీల నడుమ ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పథకాల అమలులో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో మల్లగుల్లాలు పడుతోంది.
Talliki Vandanam: అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల పెంపుతో పాటు డిఎస్సీ నియామకాల వంటి హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చినా ఆర్దిక అంశాలతో ముడిపడిన హామీలపై మాత్రం రెండున్నర నెలలుగా మదనపడుతూనే ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం ప్రధాన హామీగా ఉంది. అమ్మఒడి స్థానంలో బడికి వెల్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15వేల చొప్పున చెల్లిస్తామని టీడీపీ మిత్రపక్షాల తరపున హామీ ఇచ్చారు. ఏపీలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అమ్మఒడి పథకానికి ప్రాధాన్యత ఇచ్చింది. తొలి ఏడాది విద్యార్థుల తరపున తల్లుల ఖాతాలకు రూ.15వేలు జమ చేశారు. ఐదేళ్లలో నాలుగుసార్లు అమ్మఒడి నిధులు చెల్లించారు.
జగనన్న అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలో నాలుగేళ్లలో 44,48,865మంది మహిళలకు ఏటా రూ.15వేల రుపాయల నగదు బదిలీ అమలు చేశారు. వసతిదీవెప పథకంలో ఉన్నత చదువుల కోసం హాస్టళ్లలో ఉండే వారి కోసం 25,17,245మందికి పథకాన్ని వర్తింప చేశారు. జగనన్న విద్యా దీవెన పథకంలో 26,98,728మందికి ప్రయోజనం దక్కింది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో ప్రధానంగా జగనన్న అమ్మఒడి పథకంలో 44,48,865మందికి రూ.26,067.30కోట్లను జమ చేశారు. జగనన్న వసతి దీవెనలో 25,17,245మందికి రూ.4,275.76 కోట్లను అందించారు. జగనన్న విద్యా దీవెన పథకంలో 26,98,728మందికి రూ.12,609.68కోట్లను అందించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో 408మందికి రూ.107.07కోట్లను ఇచ్చారు.
అమ్మఒడి కంటే మెరుగ్గా...!
అమ్మఒడి పథకం కంటే మెరుగైన నగదు బదిలీ పథకాన్ని అందిస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ ప్రకటించింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దారిద్ర్య రేఖకు దిగువున ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారికి నగదు చెల్లిస్తామని ప్రకటించారు.
తల్లికి వందనం భారాన్ని తగ్గించొచ్చు ఇలా..
దేశంలో 2009 పార్లమెంటులో చట్టంగా మారిన రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం విద్య అనేది లాభాపేక్ష రహితమైన కార్యక్రమం. విద్యను వ్యాపార కార్యక్రమంగా నిర్వహించడం ఆర్టీఈ చట్ట ప్రకారం నిషిద్దం. ఆర్టీఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే ప్రభుత్వంపై గణనీయంగా భారం తగ్గుతుంది. దేశంలో విద్య, వైద్య సేవలు డబ్బుతో ముడిపడి ఉన్న అంశాలు కావడంతో వాటిని ఉమ్మడి జాబితాలో పొందుపరిచారు.
విద్యా సంస్థలకు అనుమతులు జారీ చేయడం మొదలుకుని వాటి నియమనిబంధనల వరకు ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడం లేదనే కారణాలతో ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నా వాటిని కట్టడి చేసే ప్రయత్నాలు మాత్రం విద్యా రంగంలో జరగడం లేదు. ప్రైవేట్ స్కూళ్లలో చదువులకు కూడా అమ్మఒడి వంటి పథకాలను అమలు చేసి ప్రైవేట్ విద్యను గణనీయంగా ప్రోత్సహించారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ పాఠశాలలో శాతం 25శాతం సీట్లను తప్పనిసరిగా ఉచితంగా విద్యార్ధులకు కేటాయించాల్సి ఉంటుంది. నాణ్యమైన విద్య కోసమే ప్రైవేట్ పాఠశాలల్ని అన్ని వర్గాల విద్యార్ధులు ఆశ్రయిస్తున్న సమయంలో ఆర్టీఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే విద్యార్థులకు నగదు బదిలీ చేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు.
ప్రైవేట్ స్కూళ్లలో విద్యను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం పేదలకు నగదు బదిలీ చేసే బదులు, ఆర్టీఈ చట్టం ద్వారా నిర్బంధంగా 25శాతం సీట్లను పేదలకు కేటాయిస్తే ఆ మేరకు ప్రభుత్వంపై భారాన్ని తగ్గించుకోవచ్చు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో తప్పనిసరిగా 25శాతం సీట్ల కేటాయింపు అమలు కావడంతో లేదు. కానీ ఈ దిశగా చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నం జరగలేదు. విద్యా హక్కు చట్టం కింద జరిగిన అడ్మిషన్ల వివరాలను బయట పెట్టడానికి కూడా విద్యాశాఖ సుముఖత చూపలేదు.
ఏపీలో ఆర్టీఈ చట్టం ద్వారా జిల్లాల వారీగా జరిగిన అడ్మిషన్ల వివరాలను వెల్లడించాలని హిందుస్తాన్ టైమ్స్ కోరినా సమగ్రశిక్ష అధికారులు స్పందించలేదు. గత కొన్నేళ్లుగా ఈ చట్టాన్ని బుట్టదాఖలు చేసి ప్రైవేట్ విద్యా సంస్థలకు మేలు చేయడంలో సంబంధిత శాఖ అధికారులు లోపాయికారీగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ బడులే అధికం అయినా...
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 61,511 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ పాఠశాలలు 44,407 ఉన్నాయి. ఎయిడెడ్ పాఠశాలలు 940 ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఎయిడెడ్ పాఠశాలల విషయంలో ఆంక్షలతో చాలా స్కూళ్ల ప్రైవేట్ స్కూళ్లుగా మారిపోయాయి. ఉపాధ్యాయుల్ని ప్రభుత్వానికి అప్పగించారు. ప్రైవేట్ పాఠశాలలు 13,359 ఉన్నాయి.
మొత్తం పాఠశాలల్లో పదిమందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 13,359 ఉన్నాయి. 20మందిలోపు విద్యార్థులు ఉన్నవి 12,252 ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ప్రైమరీలో చేరిన విద్యార్థుల సంఖ్య 101.66శాతం ఉంటే, అప్పర్ ప్రైమరీలో 97.62శాతం, సెకండరీలో 85.38శాతం, ఇంటర్‌లో 56.7శాతం ఉన్నారు. ప్రభుత్వ టీచర్లు లక్షా 78 వేల 778మంది ఉంటే ఖాళీలు 22,776 ఉన్నాయి.
ఆలోచిస్తే పరిష్కారం సులువే...
పేదలకు నాణ్యమైన విద్యను అందించడం, చదువుకు ఏ ఒక్కరు దూరం కాకూడదనే ఆలోచనలతో పుట్టిన ఆర్టీఈ చట్టం చాలా సమస్యలకు పరిష్కారం చూపుతుంది. విద్యా రంగంలో నెలకున్న అనైతిక విధానాలు, విద్యను వ్యాపారంగా మార్చేయడమే శాపాలుగా మారాయి.
ఫీజుల నియంత్రణ విషయంలో సైతం విద్యాశాఖ గత ఐదేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందనే ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టడానికి ఆర్టీఈ చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం పరిష్కారంగా కనిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెడితే కొంత మేరకైనా ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవచ్చు. పిల్లల్ని చదివించినందుకు ఇస్తున్న ప్రోత్సాహకం ప్రైవేట్ విద్యా సంస్థల పరమవుతున్నందున 25శాతం నిర్బంధ కోటాను అన్ని పాఠశాలల్లో ఖచ్చితంగా అమలు చేస్తే ప్రయోజనం ఉంటుంది.
సంబంధిత కథనం