Bureaucrat Babus: ఐఏఎస్‌లు మారితే అంతే సంగతులు.. జనం డబ్బుతో చెలగాటం…మార్కప్‌లో కోట్ల రుపాయల దుర్వినియోగం
Bureaucrat Babus: ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి.. పార్టీలు ప్రభుత్వాలు మారతాయి కానీ బ్యూరోక్రసీలో మాత్రం మార్పు ఉండదు. శాఖాధిపతులు మారగానే శాఖల్లోప్రాధాన్యతలు కూడా మారిపోతాయి. ఈ క్రమంలో కోట్లాది రుపాయలు నిరుపయోగం అవుతున్నాయి.
Bureaucrat Babus: ఐదేళ్లకోసారి జరిగే ఎన్నకల్లో ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ప్రజ ప్రభుత్వాలు ఏర్పాటవుతుంటాయి. అయితే ఆ ప్రభుత్వాలను నడిపించే అధికర వ్యవస్థ మాత్రం మారదు. రిటైర్మెంట్ వరకు ప్రభుత్వ శాఖల్లోనే కొనసాగుతుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ శాఖల్ని నడిపించే అధికారులు మాత్రం మారుతుంటారు. ఓ అధికారి ఆలోచనల్ని కొనసాగించడానికి మరో అధికారి సుముఖత చూపించక పోవడం వల్ల కోట్లాది రుపాయల ప్రజా ధనం దుర్వినియోగం అవుతోంది. తాజాగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో జరిగిన మార్కప్ ఉదంతమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది.
మార్కెటింగ్ శాఖాధిపతిగా ప్రస్తుత సిఎంఓ కార్యదర్శి ప్రద్యుమ్న ఉన్న సమయంలో మార్కప్ పేరుతో ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేవారు. వ్యవసాయ మద్దతు ధరలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను సేకరించి వాటిని నామమాత్రపు మార్జిన్లతో విక్రయించే యోచనతో దీనిని ఏర్పాటు చేశారు. 2021లో మొదలైన ఆలోచన 2022నాటికి కార్యరూపం దాల్చింది. 2022 డిసెంబర్‌లో ప్రద్యుమ్నకు బదిలీ కావడంతో మార్కప్ అటకెక్కింది.
ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన ఐఎఫ్‌ఎస్ అధికారి రాహుల్ పాండే దాని మీద ఆసక్తి చూపించలేదు. అనవసరమైన వ్యవహారంగా భావించారు. అప్పటికే దాని మీద పెట్టిన కోట్లాది రుపాయలు వృధా అయ్యాయి. కోట్లాది రుపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్యాకింగ్ యూనిట్లు, గోడౌన్లు నిరుపయోగంగా మారాయి. లాభసాటి వ్యాపారం కోసం ప్రారంభించిన సంస్థ అధికారుల ఈగో సమస్యలతో అర్థాంతరంగా అటకెక్కింది.
ఏమిటీ మార్కప్….
మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించని సమయంలో మార్క్ ఫెడ్ ద్వారా కనీస గిట్టుబాటు ధరలకు మినుములు, కందులు, ధాన్యం, బెల్లం వంటి ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిని ప్యాక్ చేసి రిటైల్ విక్రయాలు చేపట్టాలనేది ఆలోచనతో దీనిని ఏర్పాటు చేశారు.
రైతుల నుంచి మద్దతు ధరకు ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారా వారికి మేలు చేయడంతో పాటు వాటిని నిల్వ చేసి ప్రభుత్వమే మార్కెట్లలో విక్రయించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటైంది. కోవిడ్ సమయంలో మార్కెట్లో నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్, ఆహార ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగిపోయిన సమయంలో ప్రభుత్వమే నేరుగా ఆహార ఉత్పత్తులను విక్రయించాలని ప్రణాళికలు రూపొందించారు.
ఇందుకోసం గౌడౌన్లు, ప్యాకింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. దాదాపు ఏడెనిమిది నెలలపాటు సాగిన మార్కప్ వ్యాపార లావాదేవీల్లో నెలకు రూ.రెండుకోట్ల రుపాయల టర్నోవర్ జరిగేది. రైతు బజార్లు, టీటీడీ, ఐసిడిఎస్ వంటి సంస్థలకు రాగులు, బియ్యం, బెల్లం,శనగపప్పు, కందులు వంటి వాటిని సరఫరా చేశారు. ఇందుకోసం అయా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రతి జిల్లాలో విక్రయాల కోసం స్టాక్ పాయింట్లను, గోడౌన్లను ఏర్పాటు చేేశారు. ఇందుకోసం రూ.10కోట్ల రుపాయల ప్రభుత్వం ఖర్చు చేసింది.
ఐఏఎస్ మారితే అంతే సంగతులా…
మార్కప్ వ్యవహారంలో కనీసం రెండున్నరేళ్ల పాటు వ్యాపార లావాదేవీలు జరిగితే వ్యాపారం లాభాల బాట పడుతుందని సంస్థను ఏర్పాటు చేసే సమయంలో అంచనా వేశారు. కానీ ఏనిమిది నెలలు కూడా దానిని నడపలేదు. ఈ క్రమంలో ప్రజల డబ్బు వృధా అవుతుందని అధికారులు ఆలోచించలేదు.
విజయ బ్రాండ్ తరహాలో బియ్యం, కందిపప్పు, మినుములు, బెల్లం, రాగులు వంటి ఉత్పత్తుల్ని మార్కెట్ ధరలకంటే తక్కువకే విక్రయించే అవకాశం ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు బజార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో రిటైల్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తే ప్రజలకు చౌకధరలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు లభించేవి. ఈ ఆలోచన మంచిదే అయినా ఒకరు ప్రారంభించిన ఆలోచనను మరొకరు కొనసాగించడానికి బ్యూరోక్రసీ ఇష్టపడకపోవడమే అసలు సమస్యగా కనిపిస్తోంది.
నాణ్యమైన బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో మార్కప్ కార్యక్రమాలు కొనసాగి ఉంటే ప్రజలకు మేలు జరిగి ఉండేది. మార్కప్ లావాదేవీలు నడిచిన సమయంలో కందులు కిలో రూ.100కు కొని వాటిని గ్రేడింగ్ చేసి రూ.120కు రైతు బజార్లలో విక్రయించేవారు. టీటీడీకి శనగలు సరఫరా చేసేవారు. ఐసీడీఎస్‌కు రాగులు, రాగిపిండి సరఫరా చేసేవారు.
కనీస మద్దతు ధరలకు కొన్న వ్యవసాయ ఉత్పత్తులను నామమాత్రపు మార్జిన్‌కు మార్కెట్లలో విక్రయిస్త ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. దీని ద్వారా కొంతమందికి ఉపాధి లభించేది. 2022లో వ్యవసాయ మంత్రి కన్నబాబుకు స్థాన చలనం కలగడం, మార్కెటింగ్ శాఖ నుంచి ప్రద్యుమ్న మారిపోవడంతో ప్రాధాన్యతలు మారిపోయాయి.
కన్సల్టెన్సీ రాజ్….
ఏపీ ప్రభుత్వ శాఖల్లో ఇప్పుడు కన్సల్టెన్సీల దందా నడుస్తోంది. ప్రతి శాఖలో కన్సల్టెంట్లు చొరబడటం ఏదో ఒక కొత్త ఆలోచనతో శాఖాధిపతుల్ని ఒప్పించడం అందులో కమిషన్లు కొట్టేయడం పరిపాటిగా మారింది.
వ్యవసాయ అనుబంధ శాఖలో సేవలు అందించిన ఓ అంతర్జాతీయ కన్సల్టెన్సీకి గత ప్రభుత్వంలో నెలకు రూ.22లక్షల రుపాయలు చెల్లించినట్టు తెలుస్తోంది. సంబంధిత శాఖలో ఉన్న సీనియర్ అధికారులు, జేడీ స్థాయి అధికారులు రిటైర్మెంట్ వయసుకు దగ్గర్లో ఉండటంతో శాఖాధిపతులు ఈ కన్సల్టెంట్ల సేవలకే మొగ్గు చూపుతున్నారు.
ప్రభుత్వ అధికారుల్లో ఆధునికత సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేకపోవడం కూడా దీనికి ఓ కారణంగా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారాన్ని తిరిగి కన్సల్టెంట్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల రూపంలో కొత్త ఆలోచనలకు వాడుకుంటున్నారు.
వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో పనిచేసిన కన్సల్టెన్సీ నెలకు రూ.22లక్షలు బిల్లులు చెల్లించి ఆ శాఖకు ఏమి సేవలు అందించింది అనేది మాత్రం ఎవరికి తెలీదు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ తరహా తంతు పరిపాటిగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి.
(ఏపీ ప్రభుత్వ శాఖల్ని కన్సల్టెన్సీలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో మరో కథనంలో)