ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల మధ్య నెలకొన్న కుటుంబ వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బహుమతిగా ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకుంటూ ఆర్డీఓ జారీ చేసిన ఉత్తర్వులు తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
ఏపీ క్యాడర్‌లో డీజీ ర్యాంకులో ఉన్న పీవీ సునీల్ కుమార్‌కు,రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ కుటుంబానికి మధ్య నెలకొన్న ఆస్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
పీవీ సునీల్‌కు అతని భార్యకు మధ్య కొనసాగుతున్న వైవాహిక వివాదాల నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. పీవీ సునీల్ మామ.. పి. సుబ్బారావుకు చెందిన ఆస్తిని మనుమడి పేరిట 2019 డిసెంబర్‌లో గిఫ్ట్ డీడ్ చేశారు. ఈ క్రమంలో పీవీ సునీల్‌కు భార్య కుటుంబ వివాదాలతో ఆస్తి వివాదం తలెత్తింది. పీవీ సునీల్ సతీమణి సోదరుడు పీవీ రమేష్ ఏపీ క్యాడర్‌లో ఐఏఎస్‌గా పదవీ విరమణ చేశారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంలో ఎటువంటి షరతులు లేకుండా ప్రేమగా మనుమడికి బహుమతిగా ఇచ్చిన ఆస్తి దస్తావేజు అమల్లోకి వచ్చిన తర్వాత సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ చట్టాన్ని ఉపయోగించి దాత అదే ఆస్తిని తిరిగి తీసుకోలేరని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
రాజేంద్రనగర్ ఆర్డీవో జారీ చేసిన ఆస్తి స్వాధీన ఉత్తర్వులను న్యాయమూర్తి సి.వి. భాస్కర్ రెడ్డి కొట్టివేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ కుమారుడు పి. రోహిత్ సౌర్య (23) దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
కొండాపూర్‌లో ఉన్న భవనంలోని రెండు అంతస్తులను తన ఇద్దరు మనవళ్లకు - రోహిత్ మరియు అతని సోదరుడికి వారి తాత సుబ్బరావు 2019లో బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో నివసిస్తున్నారు.
2023లో సుబ్బారావు రాజేంద్రనగర్ ఆర్డీవోకు పిటిషన్ ఇచ్చి సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం మనుమళ్లకు గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. తన ఇద్దరు మనవళ్లు తనను సరిగా చూసుకోవడం లేదని ఆరోపిస్తూ సుబ్బారావు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ చట్టంలోని సెక్షన్ 23(1)ని ఉటంకించారు.
ఈ ఫిర్యాదుపై జనవరి 2023లో ఆర్డీవో సుబ్బరావుకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేస్తూ, కొండాపూర్ సబ్-రిజిస్ట్రార్‌ను ఇద్దరు మనవళ్ల పేరు మీద ఉన్న బహుమతి దస్తావేజును రద్దు చేయాలని ఆదేశించారు. ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేసిన కొన్ని నెలల తర్వాత 2023 అక్టోబర్‌లో సుబ్బారావు మరణించారు.
బహుమతి దస్తావేజు రద్దు చేస్తూ ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులను రోహిత్ తన జీపీఏ ద్వారా సవాలు చేశాడు. తమ తాత ఆస్తిని బహుమతిగా ఇచ్చినప్పుడు ఎటువంటి షరతులు విధించనందున ఆర్డీవోకు అధికార పరిధి లేదని మరియు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ చట్టాన్ని ఉపయోగించలేమని ఆయన తరపు న్యాయవాది పి. రాయ్ రెడ్డి వాదించారు.
ఈ కేసులో సుబ్బారావు కుమారుడు, ఏపీకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వి. రమేష్ తండ్రి తరపున న్యాయపోరాటం చేశారు. దాత మరణించిన తర్వాత, గిఫ్ట్ డీడ్ రద్దు ఉత్తర్వులను మేనల్లుడు చట్టపరమైన వారసులెవరినీ చేర్చకుండా కోర్టును ఆశ్రయించాడని పీవీ రమేష్ తరపున న్యాయవాదులు వాదించారు.
ఈ క్రమంలో తమకు ఎటువంటి నోటీసు అందలేదని, తాము విదేశాల్లో నివసిస్తున్నట్టు పీవీ సునీల్ కుమారులు కోర్టుకు తెలిపారు. దాత నుంచి గ్రహీతకు హక్కులు సంక్రమించిన తర్వాత, సరైన ప్రక్రియ లేకుండా వాటిని రద్దు చేయలేమని వాదించారు.
గిఫ్ట్‌డీడ్ దస్తావేజులను పరిశీలించిన తర్వాత, ఆస్తి బదిలీ పూర్తిగా ప్రేమతోనే జరిగిందని, దాతను పోషించాలనే షరతు ఏదీ అందులో లేదని న్యాయమూర్తి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. సుదేష్ చిక్కారా వర్సెస్ రామ్తి దేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ, అటువంటి షరతు లేనందున సెక్షన్ 23 వర్తించదని హైకోర్టు పేర్కొంది.
సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం ఆర్డీవో జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. సీనియర్ సిటిజన్స్ చట్టాన్ని అమలు చేయడానికి వారసులకు అర్హత లేదని, వివాదాన్ని సివిల్ కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
సంబంధిత కథనం