Renuka Chowdary Comments: ఏపీలో ఎక్కడైనా తిరుగుతా.. ఎవరు ఆపుతారో చూస్తా-iam ready to contest the next elections in ap said telangana congress leader renuka chowdary
Telugu News  /  Andhra Pradesh  /  Iam Ready To Contest The Next Elections In Ap Said Telangana Congress Leader Renuka Chowdary
రేణుక చౌదరి  కామెంట్స్
రేణుక చౌదరి కామెంట్స్

Renuka Chowdary Comments: ఏపీలో ఎక్కడైనా తిరుగుతా.. ఎవరు ఆపుతారో చూస్తా

01 March 2023, 21:45 ISTHT Telugu Desk
01 March 2023, 21:45 IST

Renuka Chowdary News: కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే ఏపీ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

Renuka Chowdary Comments On YCP Govt: ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి. బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె... అమరావతి రైతులు సంవత్సరాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అయినా కూడా సీఎం జగన్ పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఏపీలో పాలన చూస్తే పిచ్చోడి చేతిలో రాయిలా ఉందంటూ దుయ్యబట్టారు. రౌడీయిజం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తున్న ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు రేణుకా చౌదరి. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అసలు ప్రగతి అనేదే కనపడటం లేదని... కేవలం పేదవాళ్లను దోచుకోవటం దిశగా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏదైనా మాట్లాడితే కులాలను అంటగడుతున్నారని... వీరి విధానాలను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. ఏపీని ఎలా కాపాడుకోవాలని చాలా మంది ఆలోచిస్తున్నారని చెప్పారు.

ఏపీకి రావాలని అమరావతి రైతులతో పాటు ప్రజలు తనను ఆహ్వానిస్తున్నారని చెప్పుకొచ్చారు రేణుకా చౌదరి. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఏపీ నుంచి పోటీ చేస్తానని కామెంట్స్ చేశారు. తాను రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతానని. ఎవరు ఆపుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు. అమరావతి విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ముఖ్యమంత్రి జగన్ పాటించటం లేదన్నారు. సీఎం జగన్ మానసిక పరిస్థితి బాగాలేదని... తాను ఉచితంగా చికిత్స చేయిస్తానంటూ ఎద్దేవా చేశారు.

కేసీఆర్ పై ఫైర్...

ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై స్పందించిన రేణుకా చౌదరి... కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. పార్టీ పేరులోనే తెలంగాణ అనేదే లేకుండా చేసిన వ్యక్తి అక్కడి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని విబేధాలపై స్పందించిన ఆమె... కాంగ్రెస్‌ పార్టీ పెద్ద కుటుంబమని, భేదాభిప్రాయాలు ఉంటాయే తప్ప ఇతర పార్టీల్లో మాదిరి కాదని జవాబునిచ్చారు. 130 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతమని... ఇవన్నీ సర్దుకుపోతాయని అన్నారు.