Sarath Babu Demise : సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత, రాజకీయ ప్రముఖుల సంతాపం-hyderabad senior actor sarath babu no more cm jagan chandrababu pawan kalyan bandi sanjay pays tribute ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sarath Babu Demise : సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత, రాజకీయ ప్రముఖుల సంతాపం

Sarath Babu Demise : సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత, రాజకీయ ప్రముఖుల సంతాపం

Bandaru Satyaprasad HT Telugu
May 22, 2023 08:42 PM IST

Sarath Babu Demise : సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శరత్ బాబు(ఫైల్ ఫొటో)
శరత్ బాబు(ఫైల్ ఫొటో)

Sarath Babu Demise : టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఏపీ సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, బండి సంజయ్ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చలనచిత్ర రంగంలో గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శరత్ బాబు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని సీఎం జగన్ అన్నారు. ఆయన కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. ఈ విషాద సమయంలో శరత్ బాబు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

సీనియర్ సినీ నటుడు శరత్ బాబు మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వివిధ భాషా చిత్రాల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి దక్షిణాది సినీ పేక్షకులను మెప్పించిన శరత్ బాబు మృతి సినీరంగానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మశాంతికై ప్రార్థిస్తూ, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

శరత్‌ బాబు తుది శ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్‌ బాబు కోలుకుంటారు అనుకున్నానన్నారు. శరత్‌ బాబుతో చెన్నైలో చిత్ర పరిశ్రమ ఉన్న రోజుల నుంచీ పరిచయం ఉందని గుర్తుచేసుకున్నారు. తన మొదటి చిత్రం "అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి'లో ఆయన ముఖ్య పాత్ర పోషించారన్నారు. 'వకీల్‌ సాబ్‌' చిత్రంలోనూ నటించారన్నారు. తెలుగు చిత్రాల్లో ఆయన తనదైన నటనను చూపించారన్నారు. కథానాయకుడిగానే కాదు సహాయ పాత్రల్లో, ప్రతినాయక పాత్రల్లో విభిన్న భావోద్వేగాలు పలికించారన్నారు. ఆయన మరణంతో చిత్ర సీమకు ఓ మంచి నటుడు దూరమయ్యారని తెలిపారు. శరత్‌ బాబు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు పవన్ కల్యాణ్.

సీనియర్ నటుడు శరత్‌బాబు మృతి పట్ల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఎన్నో పాత్రలు పోషించిన కళాకారుడు దురదృష్టవశాత్తు మృతి చెందడం చిత్ర పరిశ్రమకు, తెలుగు వారికి తీరని లోటన్నారు. శరత్ బాబు కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

300 కి పైగా అనేక సందేశాత్మక చిత్రాలలో నటించి ప్రేక్షకుల మనసులు గెలిచిన సీనియర్ నటులు శరత్ బాబు మృతి పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంతాపం తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.

Whats_app_banner