Husband Killed Wife: భార్యను చంపేసి పట్టాలపై పడేసినా దొరికిపోయాడు.. కృష్ణాజిల్లాలో భర్త కిరాతకం
Husband Killed Wife: కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేసిన భర్త మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని భావించాడు.శవం కాస్త పట్టాల పై నుంచి పక్కకు జారి పోవడంతో ప్లాన్ బెడిసికొట్టింది.ఒంటిపై గాయాలేమి లేకుండా ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, నిందితుడిన గుర్తించి పట్టుకున్నారు.
Husband Killed Wife: కట్టుకున్న భార్యపై అనుమానంతో గొంతు పిసికి చంపేసినతల భర్త ఆపై దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రగిలిపోయి భార్యను నమ్మించి కడతేర్చాడు.
భార్యపై అనుమానంతో హత్య చేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. కృష్ణా జిల్లా పెద పారుపూడి మండలం పాములపాడు శివార్లలోని దూళ్లవానిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
భార్యను చంపేసి ఆపై మృత దేహాన్ని రైలు పట్టాలపై ఉంచి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితుడు విఫల యత్నం చేశాడు. దూళ్లవానిగూడెంకు చెందిన నక్కా సునీత(25) మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత అదే గ్రామానికి చెందిన రాజేష్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఆమెకు మొదటి భర్తతో ఒక పాప, రెండో భర్తతో మరో పాప ఉన్నారు.
వీరి మధ్య దాంపత్యం కొన్నాళ్లు సాఫీ గానే సాగింది. కోవిడ్ తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడంతో కుటుంబ పోషణ కోసం ఇద్దరు అప్పులు చేశారు. అప్పు ఇచ్చిన వారి నుంచి వాటిని తీర్చాలని ఒత్తిడి పెరగడంతో రాజేష్ ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో సునీత కుటుంబ పోషణ కోసం గుడివాడలోని ఓ దుకాణంలో పని చేస్తోంది. జీతం డబ్బుతో అప్పులు తీరుస్తున్నట్టు ఆమె కుటుంబీకులు తెలిపారు.
ఈ క్రమంలో గత వారం ఇంటికి తిరిగి వచ్చిన రాజేష్ భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ గొడవ పడుతున్నాడు. వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆమెపై చేయి చేసుకున్నట్టు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సునీత శనివారం ఉదయం గుడివాడకు పనికి వెళ్లింది.
రాత్రి 8 గంటల సమయంలో గుడివాడ నుంచి ఆటోలో బయల్దేరి పెదపారుపూడి జంక్షన్‌లో దిగింది. అప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తున్న భర్త రాజేష్ ఆమెను తనతో పాటు ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లే దారిలో ఇద్దరి మధ్య మాటమాటపెరిగి గొడవ పడ్డారు. దీంతో ఆవేశానికి గురైన రాజేష్ మార్గమధ్యలో సునీతను కొట్టి పంటబోదులోని నీటిలో ముంచి ఆమెను హతమార్చాడు.
ఆ తర్వాత సునీత ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించేందుకు గ్రామ శివార్లలోని రైలు పట్టాలపై మృతదేహాన్ని పడుకోబెట్టి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి సునీత మృతదేహం పట్టాల పై నుంచి జారి కింద పడి పోవడంతో ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు కాలేదు.
ఈ ఘటనపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడంతో ఆదివారం ఉదయం పోలీసులు భర్త రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తానే సునీతను చంపినట్లు భర్త రాజేష్ అంగీకరించాడు. సునీత ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించేందుకు పట్టాలపై పడుకోబెట్టినట్టు తెలిపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. గుడివాడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.