Visakha Crime: విశాఖలో దారుణం.. ప్రేమ పెళ్లి.. భార్యను వదిలించుకోడానికి నిండు గర్భిణీని గొంతు నులిమి చంపిన భర్త…-husband killed nine months preganant wife in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Crime: విశాఖలో దారుణం.. ప్రేమ పెళ్లి.. భార్యను వదిలించుకోడానికి నిండు గర్భిణీని గొంతు నులిమి చంపిన భర్త…

Visakha Crime: విశాఖలో దారుణం.. ప్రేమ పెళ్లి.. భార్యను వదిలించుకోడానికి నిండు గర్భిణీని గొంతు నులిమి చంపిన భర్త…

Sarath Chandra.B HT Telugu

Visakha Crime: విశాఖపట్నంలో అత్యంత అమానవీయ ఘటన వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు, ఆ విషయం తన కుటుంబానికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. భార్య గర్భం దాల్చడంతో ఆమెను వదిలించుకోడానికి ప్రయత్నించాడు. కుదరక పోవడంతో నిండు గర్భిణీని కిరాతకంగా హతమార్చాడు.

విశాఖలో దారుణం, నిండు గర్భిణీని గొంతు నులిమి హత్య చేసిన భర్త

Visakha Crime: విశాఖపట్నంలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. మరో రెండు రోజుల్లో ప్రసవానికి సిద్ధమైన నిండు గర్భిణీ భర్త చేతుల్లో ప్రాణాలు కోల్పోయింది. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నా తన ఇంట్లో వారికి తెలియకుండా భార్యతో కాపురం చేసిన యువకుడు చివరకు ఆమెను వదిలించుకోడానికి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికుల్ని తీవ్రంగా కలిచి వేసింది.

విశాఖపట్నంలో నిండు గర్భిణీని భర్త కిరాతకంగా గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై ఏమి ఎరగనట్టు కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రికి చికిత్సకు తీసుకువెళ్లాడు. చివరకు పోలీసుల విచారణలో గొంతు నులిమి హత్య చేసినట్టు అంగీకరించాడు. నేడో రేపో ప్రసవానికి సిద్ధమైన యువతి భర్త చేతిలో ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కంట తడి పెట్టించింది.

విశాఖపట్నం మధురవాడలో ఈ దారుణ ఘటన జరిగింది. విశాఖ నార్త్ జోన్ ఏసీపీ ఎస్. అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం దువ్వాడకు చెందిన గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూషలు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు మధురవాడలోని అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.

వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ఇరువురు 2022 డిసెంబర్‌ 10న ప్రేమ వివాహం చేసుకున్నారు. జ్ఞానేశ్వర్‌ ప్రస్తుతం విశాఖలో రెండు ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు నడుపు తున్నాడు. పెళ్లై రెండేళ్లు దాటినా భార్య అనూషను అతని తల్లిదండ్రులకు పరిచయం చేయలేదు. అనూష హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసింది. జ్ఞానేశ్వర్ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ నడుపుతూ స్కౌట్స్‌ ట్రైనింగ్ ఇచ్చే వాడు. ఈ క్రమంలో వారికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

అనూషతో వివాహం జరిగిన విషయం వారికి చెప్పకుండా నగరంలో ఉద్యోగం చేస్తున్నానని వారిని నమ్మించాడు. అత్తమామల వద్దకు వెళ్లామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటూ వచ్చేవాడు. కొద్ది నెలల క్రితం తనకు క్యాన్సర్ వచ్చిందని, విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోవా లని భార్యను మోసం చేయాలని చూసినా ఆమె అంగీకరించలేదు.

అతనితో కలిసి ఉంటానని తెగేసి చెప్పడంతో తరచుగా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. అనూషకు నెలలు నిండటంతో సోమవారం ఆమె ఆసుపత్రిలో చేరాల్సి ఉంది. ఆదివారమే ఆస్పత్రిలో చేరాలని అనూష భావించినా సోమవారం చేరొచ్చని జ్ఞానేశ్వర్ వారించాడు. దీంతో ఆసుపత్రికి తోడుగా తీసుకెళ్లేందుకు తన అమ్మమ్మను రెండు రోజుల క్రితం వారి ఇంటికి పిలిచింది.

ఆదివారం రాత్రి భర్తతో కలిసి ఒకే గదిలో పడుకుంది. సోమవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. తెల్లవారిన తర్వాత కూడా అనూష ఉలుకూ పలుకూ లేకుండా ఉండటంతో అమ్మమ్మ జ్ఞానేశ్వర్‌ను పిలిచింది.

సోమవారం ఉదయం ఏడున్నరకు జ్ఞానేశ్వర్‌ స్థానికులతో కలిసి అనూష మృతదేహాన్ని కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతని ముఖంపై గోళ్లతో గీరిన గాయాలు ఉండటంతో ఆస్పత్రి సిబ్బంది అనుమానించి ఔట్‌పోస్ట్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో పీఎం పాలెం పోలీసులు జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి ప్రశ్నించారు. పోలీసులు గట్టిగా నిలదీయడంతో గొంతు నులిమి, ఆపై చున్నీతో ఉరి బిగించి హత్య చేసినట్టుఅంగీకరించాడని ఏసీపీ తెలిపారు.

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డు రోడ్డు ప్రాంతానికి చెందిన కేదారశెట్టి అనూషకు పెద్ద దిక్కు లేకపోవడంతో అడ్డు తొలగించుకోవాలని జ్ఞానేశ్వర్ భావించాడు. ఆమె తల్లికి చూపు లేకపోవడం, తండ్రి నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమె తరపున మాట్లాడే పెద్ద దిక్కు లేక పోవడంతో ప్రేమ పేరుతో నిందితుడు ఆమెను నమ్మించి వివాహం చేసుకున్నాడు. ఆపై వదిలించుకునే ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో హత్య చేసినట్టు పోలీసులు వివరించారు. అనూష అత్త మామల వద్దకు తీసుకెళ్లాలని కోరినపుడు పిల్లలు పుట్టినాక తీసుకెళ్దామని చెప్పవాడని పోలీసులు వివరించారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం