West Godavari District : అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..! ఆపై ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. అనుమానంతో భార్యను భర్త హత్య చేశాడు. ఆపై అతను కూడా సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త… ఆ తరువాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం ఉండి మండలం కలిగొట్ల గ్రామంలో జరిగింది.
ఉండిలోని గోరింతోటకు చెందిన గొల్ల చిరంజీవితో కలిగొట్ల గ్రామానికి చెందిన సత్యవతి (36)తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఏడో తరగతి, చిన్నవాడు మూడో తరగతి చదువుతున్నాడు. చిరంజీవి జీవనోపాధి నిమిత్తం కతర్ దేశం వెళ్లి కొత్తకాలం పనిచేసి తరువాత స్వగ్రామం వచ్చి ఆటో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు.
అనుమానంతోనే…!
అయితే గత కొంతకాలం నుంచి భార్య సత్యవతిపై చిరంజీవికి అనుమానం పెరిగింది. దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి 8 గంటల సమయంలో భార్యా భర్తలకు గొడవ జరగగా, భార్య సత్యవతి తన తల్లి భూపతి అవ్వమ్మ ఇంటికి వెళ్లగా, అవ్వమ్మ తన కుమార్తె సత్యవతికి నచ్చజెప్పి ఇంటికి పంపింది.
గురువారం తెల్లవారుజామున భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అవ్వమ్మ కుమారుడికి ఫోన్ వచ్చింది. మీ బావ చిరంజీవి ఎలుకల మందు మింగి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారని ఫోన్‌లో చెప్పారు. దీంతో కంగారుపడిన అవ్వమ్మ కుమార్తె ఇంటికి వెళ్లి చూసింది. అయితే అప్పటికే భార్య సత్యవతిని భర్త చిరంజీవి హత్య చేయడంతో ఆమె విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను అవ్వమ్మ చూసింది. దీంతో అవ్వమ్మ కుమార్తె విగతజీవిలా కనిపించేసరికి బోరున విలపించింది.
సత్యవతి హత్యతో కలిగొట్ల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు రోదలను మిన్నంటాయి. తల్లి సత్యవతి మరణంతో ఇద్దరు కుమారులు అనాథలయ్యారు. సత్యవతి గత ప్రభుత్వంలో వాలంటీర్‌గా పని చేసిందని… తన కుమార్తెపై అనుమానంతోనే తన అల్లుడు చిరంజీవి దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు తల్లి అవ్వమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఫిర్యాదు తీసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. సత్యవతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని… దర్యాప్తు చేస్తున్నామని ఉండి ఎస్ఐ మహమ్మద్ నసీరుల్లా తెలిపారు.