Anantapur : అనంతపురం జిల్లాలో ఘోరం.. పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రాలేదని.. గొంతు కోసిన భర్త
Anantapur : అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రాలేదని.. కోపంతో గొంతు కోసి హతమార్చాడు ఓ భర్త. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. భార్యను హతమార్చి భర్త పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామంలో దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ భర్త తన భార్య గొంతు కోసి హత్య చేశాడు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి మెట్టినింటికి రాలేదనే కోపంతో.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త పరారయ్యాడు. గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామానికి చెందిన వన్నూరు స్వామికి.. అదే గ్రామానికి చెందిన బోయ జ్యోతితో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
భార్యభర్తల మధ్య తరచూ గొడవులు జరిగేవి. ఇటీవలి కాలంలోనూ ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. మనస్పర్ధలు కారణంగా జ్యోతి పుట్టింటికి వెళ్లగా.. నచ్చజెప్పి ఆమెను తీసుకుని వచ్చేందుకు భర్త వన్నూరు స్వామి వెళ్లాడు. అయితే.. ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్య జ్యోతి గొంతును కత్తితో కోసి వన్నూరు స్వామి పరారయ్యాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గుమ్మగట్ట పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలి వద్ద పరిస్థితిని పరిశీలించి కేసు నమోదు చేశారు. జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం కావడంతో పోస్టుమార్టం జరగడం ఆలస్యం కావచ్చని.. సోమవారమే జ్యోతి బాడీ వచ్చే అవకాశం ఉందని స్థానికులు తెలుపుతున్నారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని, అలాగే నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
జ్యోతి మరణంతో ముగ్గురు పిల్లలు తల్లి లేని లోటును ఎదుర్కొంటున్నారు. తల్లిని తన తండ్రే హత్య చేయడాన్ని ముగ్గురు పిల్లలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ చిన్నారుల రోదనలు స్థానికులతో కన్నీరు పెట్టిస్తున్నాయి. జ్యోతి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. జ్యోతి హత్యతో కలుగోడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పిడుగుపడి భార్యభర్తలు మృతి..
అనంతపురం జిల్లాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పిడుగుపడి భార్యభర్తలు అక్కడికక్కడే మరణించారు. వారి కుమారుడు పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని ఎగువ గంగంపల్లి పంచాయతీ దిగువ గంగంపల్లి తండాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. దిగువ గంగంపల్లిలో ఆదివారం ఉదయం భారీ వర్షం పడింది. భారీ గాలులు, పిడుగులతో వర్షం పడటంతో ఈ ఘటన జరిగింది. దిగువ గంగంపల్లిలో పిడుతు పడటంతో దసరా నాయక్, ఆయన భార్య, రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి.
కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కుమారుడిని స్థానికులు పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో దిగువ గంగంపల్లిలో విషాదం నెలకొంది. దసరా నాయక్ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. దసరా నాయక్, ఆయన భార్య మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)