AP Crime News : మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..! భార్యను హతమార్చిన భర్త
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను కత్తి వేటుతో భర్త హతమార్చాడు. ఈ దారుణ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని వీరభద్రవరంలో జరిగింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పల్నాడు జిల్లాలో అనుమానంతో భార్యను భర్త కొట్టి చంపాడు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను భర్త కత్తి వేటుతో హతమార్చాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం వీరభద్రవరంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామవరపుకోటకు చెందిన పెమ్మి రాముకు ఏడేళ్ల క్రితం శ్రావణి (25)తో వివాహం అయింది. శ్రావనికి 18వ ఏటనే పెళ్లి చేశారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్లుగా వీరభద్రవరం శివారులోని పొలంలో పాక వేసుకుని నివాసం ఉంటున్నారు. భర్త రాము మద్యానికి బానిస అయ్యాడు. దీంతో వీరింట్లో నిరంతరం గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
మద్యం తాగేందుకు డబ్బుల కోసం నిత్యం భార్యను వేధించేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం మద్యం తాగేందుకు భార్య శ్రావణిని భర్త రాము డబ్బులు అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. కోపానికి లోనైన భర్త రాము, భార్య శ్రావణి మెడపై కత్తితో వేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కత్తితో నరకడంతో తీవ్ర రక్త స్రావం జరిగి, ఆమె అక్కడికే మృతి చెందింది.
మృతురాలి శ్రావణి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ జయకుమార్ పేర్కొన్నారు. తండ్రి చేతులోనే తల్లి హత్యకు గురికావడంతో ఇద్దరు పిల్లలు అనాథులయ్యారు. శ్రావణి మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబ సభ్యులు రోదించారు. బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ ఘటనతో వీరభద్రవరం గ్రామంలో విషాదం నెలకొంది.
అనుమానంతో భార్యను కొట్టి చంపిన భర్త:
పల్నాడు జిల్లాలో భార్యను భర్త కొట్టి చంపాడు. అయితే ఆమె ఉరి వేసుకున్నట్లు కథ అల్లాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావు పేట రూరల్ మండలంలో గురువాయపాలెం గ్రామంలో చోటు చేసుకుంది.
గురువాయపాలెం గ్రామంలోని గర్నెపూడి రమేష్, అనిత (31) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఎనిమిదేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. వీరు పొగాకు పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే భార్యపై భర్త రమేష్ అనుమానం పెంచుకున్నాడు.
అయితే ఇటీవలి భార్య పొగాకు పనికి కూడా రావటం లేదు. దీంతో ఆమెపై మరింత అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెను ఇంట్లోనే తీవ్రంగా కొట్టి హత్య చేశాడు. ఆ తరువాత సైలాన్‌తాడుతో ఉరి వేశాడు. ఆమె ఉరి వేసుకుందని కథ అల్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిషోర్ తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం