Kadapa Double Murder : మ‌ద్యం మ‌త్తులో దారుణం - భార్యాబిడ్డలను గొంతు కోసి చంపేశాడు..!-husband killed his wife and daughter in kadapa district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kadapa Double Murder : మ‌ద్యం మ‌త్తులో దారుణం - భార్యాబిడ్డలను గొంతు కోసి చంపేశాడు..!

Kadapa Double Murder : మ‌ద్యం మ‌త్తులో దారుణం - భార్యాబిడ్డలను గొంతు కోసి చంపేశాడు..!

HT Telugu Desk HT Telugu
Jan 08, 2025 05:09 PM IST

క‌డ‌ప జిల్లాలో ఘోర‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌ద్యం మ‌త్తులో భార్య‌, కుమార్తె గొంతు కోసి తండ్రి అతికిరాత‌కంగా హ‌త‌మార్చ‌ాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం రేపింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

కడప జిల్లాలో ఘోరం..!
కడప జిల్లాలో ఘోరం..! (image source unsplash.com)

కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన యజమానే అంతమొందించాడు. మద్యం మత్తులో కట్టుకున్న బార్య, కన్నబిడ్డను అతికిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

yearly horoscope entry point

తొండూరు మండలంలోని తేలూరు తుమ్మ‌ల‌ప‌ల్లె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… తేలూరు తుమ్మ‌ల‌ప‌ల్లె గ్రామానికి చెందిన‌ గంగాధ‌ర్‌రెడ్డికి, సైదాపురానికి చెందిన శ్రీ‌ల‌క్ష్మి (37)తో కొన్ని సంవ‌త్స‌రాల క్రితం వివాహం జ‌రిగింది. ఈ దంప‌తుల‌కు గంగోత్రి (13) కుమార్తె కూడా ఉంది. గంగాధ‌ర్ రెడ్డి బేల్దారిగా ప‌ని చేస్తుండ‌గా, శ్రీ‌ల‌క్ష్మి అదే గ్రామంలోని అంగ‌న్‌వాడీ కేంద్రంలో స‌హాయ‌కురాలిగా ప‌ని చేస్తోంది. కుమార్తె గంగోత్రి ఇన‌గ‌లూరు జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతోంది.

మద్యం మత్తులో దారుణం….

భర్త గంగాధ‌ర్ రెడ్డి మ‌ద్యానికి బానిసయ్యాడు. ప్ర‌తి రోజు మ‌ద్యం సేవిస్తూ ప‌ని సైతం వెళ్ల‌కుండా ఇంటివ‌ద్దే ఉంటున్నాడు. సోమ‌వారం రాత్రి ప‌ది గంట‌లు దాటిన త‌రువాత ఫుల్‌గా మ‌ద్యం తాగి ఇంటికి వ‌చ్చాడు. అప్ప‌టికే భార్య అంగ‌న్‌వాడీ ప‌ని ముగించుకుని వ‌చ్చి రాత్రి భోజ‌నం చేసింది. అనంత‌రం కుమార్తె, ఆమె భోజ‌నం చేసి నిద్ర‌పోయారు. నిద్ర‌లో ఉన్న భార్య‌ను లేపిన గంగాధర్ రెడ్డి.. ఘర్షణకు దిగాడు. దీంతో ఇద్ద‌ర మ‌ధ్య స్వ‌ల్ప గొడవ చేసుకుంది.

వెంట‌నే భార్య‌ను చంప‌డానికి గంగాధర్ రెడ్డి కొడ‌వ‌లి తీశాడు. ఈ లోపు త‌ల్లిదండ్రుల మ‌ధ్య చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ‌తో కుమార్తె గంగోత్రి నిద్ర‌నుంచి లేచిపోయింది. భార్య గొంతును గంగాధ‌ర్ కొడ‌వ‌లితో కోసి హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. దీంతో కుమార్తె గంగోత్రి అడ్డ‌గించేందుకు ప్ర‌య‌త్నించింది. దీంతో మ‌రింత రెచ్చిపోయిన గంగాధ‌ర్ రెడ్డి విచ‌క్ష‌ణార‌హితంగా మ‌ద్యం మ‌త్తులో భార్య‌, కుమార్తెల‌ను గొంతు కోసి అతి కిరాత‌కంగా హ‌త్య చేశాడు. అనంత‌రం అదే మ‌ద్యం మ‌త్తులో అక్క‌డే ప‌డి నిద్ర‌పోయాడు.

ఫోన్ లిఫ్ట్ చేసి సమాచారం….

మంగ‌ళ‌వారం ఉద‌యం తొమ్మిది గంట‌ల‌కే అంగ‌న్‌వాడీ కేంద్రం తెర‌వాల్సిఉండ‌గా శ్రీ‌ల‌క్ష్మి రాలేదు. ప్ర‌తిరోజు శ్రీ‌లక్ష్మి స‌మ‌యానికి వ‌చ్చి అంగ‌న్‌వాడీ కేంద్ర తెరిచేది. కానీ ఈ రోజు ఎందుకు రాలేద‌ని అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ ఆమె ఇంటికి వెళ్లింది. ఇంటి బ‌య‌టే ఉన్న గంగాధ‌ర్ రెడ్డి అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్‌కు తాళం చెవి ఇచ్చాడు. దీంతో ఆమె అక్క‌డ నుంచి వెళ్లిపోయి, అంగ‌న్‌వాడీ కేంద్రం తీసింది. అయితే ఎంత సేప‌టికి శ్రీ‌ల‌క్ష్మి రాక‌పోవడంతో అంగ‌న్‌వాడీ వ‌ర్కర్ ఫోన్ చేసింది. ఫోన్ గంగాధ‌ర్ రెడ్డి ఆన్స‌ర్ చేసి త‌న భార్య‌, కుమార్తెను చంపేశాన‌ని చెప్పాడు.

దీంతో భ‌యందోళ‌న‌కు గురైన అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ కంగారుగా స్థానికుల‌కు ఈ విష‌యం చెప్పింది. అప్పుడు స్థానికులతో క‌లిసి ఆ ఇంటికి వెళ్లారు. అక్క‌డ చూడగా ఇంట్లో మంచాల‌పై త‌ల్లి, కుమార్తె విగ‌త‌జీవులుగా ప‌డి ఉన్నారు. దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే పులివెందుల రూర‌ల్ సీఐ వెంక‌ట‌ర‌మ‌ణ త‌న సిబ్బందితో క‌లిసి ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించి, స్థానికుల నుంచి వివ‌రాల సేక‌రించారు. పోస్టుమార్టం కోసం మృత దేహాల‌ను పులివెందుల ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

పోలీసుల అదుపులో నిందితుడు…

నిందితుడు గంగాధ‌ర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని, కేసు న‌మోదు చేశారు. సీఐ వెంక‌ట‌ర‌మ‌ణ మాట్లాడుతూ… ఈ జంట హ‌త్య‌ల ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశామ‌ని, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు. మృతురాలి కుటుంబ స‌భ్యులు, బంధువులు రోద‌న‌లు మిన్నంటాయి. తేలూరు తుమ్మ‌ల‌ప‌ల్లె గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. త‌ల్లి, కుమార్తె మృత‌దేహాల‌ను చూసి స్థానికులు తీవ్రంగా క‌ల‌త చెందారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం