కృష్ణా బేసిన్ లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే జూరాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం 68,169 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవాళ్టి ఉదయం రిపోర్ట్ ప్రకారం…. శ్రీశైలం డ్యామ్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.6 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166.89 టీఎంసీలుగా ఉంది. ఔట్ ఫ్లో 63,150 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు
శ్రీశైలం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంటుంది. ఫలితంగా శ్రీశైలం డ్యామ్ నిండడానికి తక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఎగువ రాష్ట్రాల్లోనే కాకుండా ఏపీలోనూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో…. శ్రీశైలం ప్రాజెక్ట్ ఈసారి ముందుగానే నిండటం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం… ఆదివారం క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు నాగార్జున సాగర్ లో పరిస్థితి చూస్తే ఇవాళ ఉదయం రిపోర్ట్ ప్రకారం నీటిమట్టం 519.2 గా ఉంది. ఇక 147.82 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 50,771 గా ఉండగా… 4,933 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. 156.33 అడుగుల నీటిమట్టం ఉంది. 21.53 టీఎంసీల నీటి నిల్వ ఉంది.ఇన్ ఫ్లో నిల్ ఉండగా… ఔట్ ఫ్లో 4,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి స్వల్పంగా వరద నీరు చేరుతోంది.
సంబంధిత కథనం