AP Sankranti 2025 : కోడి పందేలు, గుండాట, పేకాట, కోతాట.. మూడు రోజుల్లో రూ.5 వేల కోట్ల పైమాటే!
AP Sankranti 2025 : సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేంది కోడి పందేలు. గోదావరి జిల్లాలు కోడి పందేలకు పెట్టింది పేరు. ఇప్పుడు కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలు మొదలుకొని అన్ని జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. గుండాట, పేకాట వంటి జూద క్రీడల్లో దాదాపు రూ.5 వేల కోట్లకుపైగా చేతులు మారినట్లు అంచనా.
సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో.. కోడి పందేలు, గుండాట, పేకాట, కోతాట వంటి జూద క్రీడల్లో దాదాపు రూ.5,000 కోట్ల పైగా చేతులు మారినట్లు అంచనా వేస్తోన్నారు. ఇందులో సింహా భాగం కోడి పందేలదే. మూడు రోజుల్లో కోడి పందేల ద్వారా దాదాపు రూ.4,500 కోట్లు చేతులు మారాయి. గుండాట, పేకాట, కోతాట వంటి జూద క్రీడలతో దాదాపు రూ.500 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు.
రూ.కోట్లలో పందేలు..
ఒక్కో కోడి పందేల బరిలో మూడు రోజుల్లో రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు చేతులు మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,000కి పైగా బరుల్లో కోడి పందేలు జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే సుమారు 750 కోడి పందేల బరులు ఉండగా అందలో 300కి పైగా కోట్లలో పందేలు జరిగే బరులు ఉన్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 700కి పైగా కోడి పందేలు బరులుండగా.. సుమారు 250కిపైగా పెద్ద బరులు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ 320కిపైగా కోడి పందేల బరులు ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 150 వరకు బరులు ఏర్పాటు చేశారు.
ఏరులైపారిన మద్యం..
ఇక మద్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గతం కంటే రెండింతలు మద్యం అమ్మకాలు జరిగినట్లు మద్యం షాపుల యజమానులు, బెల్ట్ షాపులను నిర్వహించే వారు చెబుతున్నారు. కోడి పందేలు, గుండాట, పేకాట, కోతాట వంటి జూద క్రీడల బరుల వద్దే మద్యం ఏరులై పారింది. బహిరంగంగానే వాటర్ బాటిల్స్, కూల్ డ్రిక్స్ అమ్మే విధంగా స్టాల్స్ పెట్టి మద్యం అమ్మకాలు నిర్వహించారు.
భారీ స్థాయిలో..
కోడి పందేల బరుల నిర్వహణకు రాజకీయ పార్టీ నేతలు వేలం వేసి మరి, కోడి పందేలను భారీ స్థాయిలో నిర్వహించారు. చెదురుముదురు ఘటనలు మినహా ఎటువంటి భారీ స్థాయి గొడవులు, కొట్లాటలు చోటు చేసుకోలేదు. అక్కడక్కడ కోడి పందేలు బరుల వద్ద చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. రాజకీయ పెద్దలు, నిర్వహకులు జోక్యంతో అవి సమసిపోయాయి.
పెద్దపెద్ద బరులు..
ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పెద్ద బరుల్లో రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలు, ఆపైన మొత్తాల్లోనే పందేలు జరిగాయి. చిన్న బరుల్లో రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు పందేలు జరిగాయి. కొన్ని చోట్ల రూ.కోటి, కోటిన్నర పందేలు కూడా జరిగాయి. రాష్ట్రంలో అతిపెద్ద బరులు గుంటూరు జిల్లా బాపట్లలోని మంతెన వారిపాలెంలో 40 ఎకరాల్లోనూ, రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో 30 ఎకరాల్లోనూ, పశ్చిమ గోదావరి జిల్లా అమిరంలో 25 ఎకరాల్లో కోడి పందేల ప్రాంగణాలు ఏర్పాటు చేశారు.
సినిమా సెట్టింగ్‌లా..
అమిరంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడి పందేలను ప్రారంభించారు. సినిమా సెట్టింగ్‌లను తలపించేలా దారి పొడువునా ఫ్లెక్సీలు, వేలాది మంది కూర్చునేలా కుర్చీలు, ప్రముఖుల కోసం వీఐపీ గ్యాలరీలు, సోఫాసెట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్‌లైట్లతో ఒక ఉత్సవంలా పందేలను నిర్వహించారు.
చింతమనేని మార్క్..
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏకంగా మినీ స్టేడియంలా బరిని సిద్ధం చేయించి పందేలను నిర్వహించారు. దెందులూరు నియోజకవర్గంలో దుగ్గిరాలలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న స్థలంలో ఈ బరులు ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్లు, వీఐపీలు రెస్ట్ తీసుకోవడానికి క్యారవాన్, పక్కనే కోసాట, గుండాట వంటి జూద క్రీడలు నిర్వహించారు.
మహిళ బౌన్సర్లు..
కోడి పందేలు బరుల వద్ద మహిళా బౌన్సర్లను కూడా పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కోడి పందేల బరుల వద్ద మహిళ బౌన్సర్లను రంగంలోకి దింపారు. కోడిపందేల నిర్వాహకులు బరుల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా మహిళ బౌన్సర్లను పెట్టినట్లు కొంత మంది చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో..
రాష్ట్రంలో కోడి పందేల నిర్వహణకు ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలు కూడా వదలలేదు. ప్రభుత్వ పాఠశాలల ఆవరణంలో కోడి పందేలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ జిల్లాలోని తునిలో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోనే కోడి పందేలు, గుండాట నిర్వహించారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనే కోడి పందేలు నిర్వహించారు.
క్యాసినో.. డ్యాన్సులు..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో క్యాసినో, డ్యాన్సులు జరిగాయి. భీమవరంలో క్యాసినో జూదం జరిగింది. కోడి పందేల బరి వద్ద మ్యూజికల్ నైట్ నిర్వహించారు. కోనసీమ జిల్లాలో మామిడికుదురు మండలం గోగన్నమఠం, మలికిపురం మండలం కేశనపల్లితో పాటు అమలాపురంలో రికార్డింగ్ డ్యాన్సుల పేరుతో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)