Railway Budget : రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు.. వివరాలు ఇవే
Railway Budget : రైల్వే బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిగాయి. ఏపీకి రూ.9,417 కోట్లు కేటాయించినట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తెలంగాణకు రూ.5337 కోట్లు కేటాయించారు. త్వరలో తెలంగాణకు నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు రానున్నాయి.
రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిగాయి. రైల్వేబడ్జెట్‌లో ఏపీకి రికార్డ్ స్థాయిలో కేటాయింపులు జరిగాయి. ఏపీకి రూ.9,417 కోట్లు కేటాయించిన్టటు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5337 కోట్లు కేటాయించారు. కాజీపేటలో రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు.

త్వరలో నమో భారత్ రైళ్లు..
ఇప్పటి వరకు తెలంగాణకు రూ.41,677 కోట్లు మంజూరు అయినట్టు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. త్వరలో తెలంగాణకు నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు రానున్నాయని ప్రకటించారు. ఏపీలో రూ.84,559 కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. ఏపీలో 74 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేశామన్న కేంద్రమంత్రి.. 1560 కి.మీ.కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేశామని చెప్పారు.
ఏపీకి మేలు చేసేలా..
'ఏపీకి అన్ని విధాలా మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉంది. ఏఐ, గ్రీన్ ఎనర్జీ వంటి వినూత్నమైన పాలసీలతో మోదీ ప్రభుత్వం ముందుకెళుతోంది. దేశమంటే మట్టికాదోయ్ - దేశమంటే మనుషులోయ్ అని తెలుగుకవి గురజాడ అప్పారావు చెప్పిన సూక్తిని.. బడ్జెట్ తొలి వ్యాఖ్యాల్లో ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అమరావతికి ఈ ఏడాదిలోనే రూ. 15 వేల కోట్లు కేటాయించబోతున్నారు' అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాబోయే రోజుల్లో..
'రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు ఇచ్చి కేంద్రం ఆదుకుంటుంది. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,157 కోట్లు ప్రకటించిన కేంద్రం ఈ బడ్జెట్‌లో రూ. 5,936 కోట్లు కేటాయించింది. విశాఖ స్టీల్ ను ఆదుకునేందుకు బడ్జెట్ కు ముందే కేంద్రం రూ. 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ బడ్జెట్ లో రూ. 3,295 కోట్లు కేటాయించారు. విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు, విశాఖ-చెన్నై కారిడార్ కు రూ.285 కోట్లు కేటాయించారు. విశాఖ రైల్వే జోన్ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధికి రూ. 5 కోట్ల నిధులు ప్రకటించారు' అని చంద్రబాబు వివరించారు.
రేవంత్ అసంతృప్తి..
కేంద్ర ప్రభుత్వానికి మనం అడిగింది ఏంటి.. వాళ్లు ఇచ్చింది ఏంటి.. అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనుసరించాల్సిన ఆర్థికపరమైన విధానాలు, పథకాల ప్రాధాన్యతపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో ఇటీవల చర్చించారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు కేటాయించింది.