Online Services: హెచ్‌టి ఎఫెక్ట్‌.. ఏపీలో ఇక ఆన్‌లైన్‌లోనే స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ సేవలు..-ht effect stamps and registration services are now online in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Online Services: హెచ్‌టి ఎఫెక్ట్‌.. ఏపీలో ఇక ఆన్‌లైన్‌లోనే స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ సేవలు..

Online Services: హెచ్‌టి ఎఫెక్ట్‌.. ఏపీలో ఇక ఆన్‌లైన్‌లోనే స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ సేవలు..

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 19, 2024 08:47 AM IST

Online Services: ఆంధ్రప్రదేశ్‌లో ఈసీలు, సర్టిఫైడ్ కాపీల జారీలో తలెత్తుతున్న అవాంతరాలు హిందుస్తాన్‌ టైమ్స్‌ కథనానికి ప్రభుత్వం స్పందించింది.ఆన్‌లైన్‌లోనే నేరుగా పౌరులు స్టాంప్స్‌ అండ్ రిజస్ట్రేషన్స్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు రెవిన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.

ఆన్‌లైన్‌లో స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ సేవలు
ఆన్‌లైన్‌లో స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ సేవలు

Online Services: ఏపీలో ప్రజలకు గ్రామ,వార్డు సచివాలయాలు, మీసేవల మధ్య సమన్వయ లోపంతో పౌర సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై హెచ్‌టి కథనానికి ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఐటీ ఆధారిత సేవల్లో జాప్యంపై మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్‌లోనే అన్ని రకాల పౌరసేవల్ని అందించేలా స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ సిద్ధం చేశారు. త్వరలో వాట్సాప్‌లోనే పౌర సేవల్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

మరోవైపు ఆన్ లైన్‌లో ప్రజలు నేరుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సేవలు పొందేందుకు ఏర్పాటు చేసినట్టు రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. ఎవరు ఎక్కడి నుంచైనా ఈసీ, సీసీ ప్రింట్ అవుట్ అందుకునే సౌలభ్యం కల్పించారు. మరోవైపు మీసేవ ద్వారా అందించే సేవలు యథాతథంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.

దళారుల ప్రమేయం లేదు…

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందిస్తున్న విభిన్న రకాల సేవలు ఇప్పుడు మరింత సులభతరం అయ్యాయి. సచివాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కాని, ఇటు మీ సేవా కేంద్రానికి కాని నేరుగా వెళ్లవలసిన అవసరం లేకుండానే ఇసి, సిసి వంటి సేవలు అందుకునే అవకాశం లభించింది. సగటు పౌరుడు సైతం తనకు అందుబాటులో ఉన్న ప్రాంతం నుండి ఆన్ లైన్ విధానంలో అవసరమైన రుసుమును స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెల్లించటం ద్వారా ఎన్‌ కంబరెన్స్‌ సర్టిఫికెట్‌, సర్టిఫైడ్‌ కాపీలను క్షణాల వ్యవధిలో పొందగలిగేలా ఏర్పాటు చేసినట్టు ఆర్పీ సిసోడియా వివరించారు.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్ సైట్ ద్వారా చెల్లింపు గేట్ వే ను అభివృద్ది చేశారు. ఎన్‌కంబరెన్స్, సర్టిఫైడ్ కాపీలు ఆన్‌లైన్‌లో తక్షణమే పొందగలిగే వెసులుబాటు లభించింది. ఆన్ లైన్ సౌకర్యాన్ని అందిపుచ్చుకోలేని గ్రామీణ ప్రాంత వాసులు మీ సేవ ద్వారా కూడా ఎన్‌కంబరెన్స్, సర్టిఫైడ్ కాపీలను అందుకోవచ్చు. దానికి ఎటువంటి పరిమితులు లేవని వివరించారు.

గతంలో ఈ సేవలను పొందేందుకు ప్రతి ఒక్కరూ మీసేవా కేంద్రానికి వెళ్లవలసి వచ్చేది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆ శ్రమను సైతం తగ్గించాలని నిర్ణయించింది. ఫలితంగా అందుబాటులోకి వచ్చిన ఆన్ లైన్ విధానం ఫలితాలను ఇస్తుందన్నారు.

ఆస్తుల కొనుగోలు, అమ్మకాల్లో నిర్ణీత దరఖాస్తును నింపి దానిని సబ్ రిజిస్ట్రార్ లేదా మీ సేవా కేంద్రానికి తీసుకువెళ్లవలసిన అవసరం లేకుండా పోయింది. గతంలో ఎన్‌కంబరెన్స్, సర్టిఫైడ్ కాపీ సేవల కోసం మీసేవలో దరఖాస్తు చేసిన తరువాత, అది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని, అక్కడ తగిన అనుమతులు పొందిన తదుపరి మీసేవలో జరిగే డౌన్ లోడ్ ప్రక్రియ ద్వారా మాత్రమే డాక్యుమెంట్ ను పొందగలిగే వారు. ఫలితంగా మితిమీరిన కాలయాపన జరిగేది. రెండు, మూడు రోజుల సమయం తీసుకునేది. సెలవు రోజులు వస్తే అది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండేది. దరఖాస్తుదారు కనీసం రెండు నుండి మూడు సార్లు మీసేవ కార్యాలయానికి తిరిగవలసి వచ్చేంది. ఇప్పుడు ఆ పరిస్ధితి లేకుండానే అతి తక్కువ వ్యవధిలో అవసరమైన డాక్యుమెంట్ ప్రజలకు చేరుతోంది.

నేరుగా రెవిన్యూ శాఖకు ఫీజులు..

గతంలో దరఖాస్తుదారుడు చెల్లించిన ఫీజులు మీ సేవా విభాగానికి జమ అయ్యేవి. ఇప్పుడు నేరుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు జమపడుతున్నాయి. ప్రస్తుత ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఈసి, సీసీలు పొందగలుగుతున్నారని రెవెన్యూ (భూపరిపాలన, సర్వే సెటిల్ మెంట్, విపత్తుల నిర్వహణ, స్లాంపులు, రిజిస్టేషన్లు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. మీ సేవా కేంద్రాలలో కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.

మీ సేవ ద్వారా మాత్రమే కాకుండా ఆన్ లైన్ సేవల ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందిస్తున్న విభిన్న రకాల సేవలు ఇప్పుడు మరింత సులభం అయ్యాయి. అటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి, మీ సేవా కేంద్రానికి కాని నేరుగా వెళ్లవలసిన అవసరం లేకుండానే ఇషి, సిసి వంటి సేవలు అందుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు.ఎక్కడి వారైనా ఎక్కడి ఆస్తులకైనా ఆన్ లైన్ విధానంలో అవసరమైన రుసుమును స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెల్లించటం ద్వారా ఈసీ, సీసీలను క్షణాల వ్యవధిలో పొందవచ్చని వివరించారు.

1983కు తర్వాత రిజిస్ట్రేషన్‌లు…

ఆన్‌లైన్‌ స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ సేవలు 1983కు ముందు జరిగిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. అంతకు ముందు జరిగిన రిజిస్ట్రేషన్ వివరాలను సంబంధిత సబ్‌ రిజిస్టార్ కార్యాలయాల్లో పొందాల్సి ఉంటుంది. ఎవరైనా తమ ఆధార్, మొబైల్ ద్వారా https://cardprimme.rs.ap.gov.in/PDE/ECLoginPage సైట్‌లో రిజిస్టర్‌ చేసుకుని ఈ సేవల్ని నేరుగా వినియోగించుకోవచ్చని ఆర్పీ సిసోడియా తెలిపారు. స్టాంప్ రిజిస్ట్రేషన్ డ్యూటీ విలువను కూడా నేరుగా లెక్కించుకునే సదుపాయం కల్పించారు.

Whats_app_banner

సంబంధిత కథనం