Minister On Volunteers: లేని బిడ్డకు పేరెలా పెట్టాలి..వాలంటీర్లు వ్యవస్థలో లేరు, జీతాల పెంపు ప్రస్తావనే లేదన్న మంత్రి
Minister On Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడం, వేతనాల పెంపుపై శాసనమండలిలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. వైసీపీ తరపున బొత్స అడిగిన ప్రశ్నకు డోలా స్పష్టత ఇచ్చారు. వ్యవస్థలో లేని వాలంటీర్లకు జీతాల పెంపు ప్రస్తావనే రాదన్నారు.
Minister On Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇచ్చేసింది. మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సాంఘిక సంక్షేమ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టత ఇచ్చారు. వాలంటీర్లు ప్రభుత్వ వ్యవస్థలో లేరని, 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. వ్యవస్థలో వాలంటీర్లు లేనందున వారిని గత ప్రభుత్వమే అధికారికంగా కొనసాగించ లేదు కాబట్టి అలాంటి ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు.
ఎన్నికల్లో వాలంటీర్లను కొనసాగిస్తామని తాము చెప్పామని కానీ వ్యవస్థలో లేని వాళ్లకు జీతాలెలా పెంచుతామని ప్రశ్నించారు. లేని బిడ్డకు పేరు పెట్టమని, మరేదో చేయమని సభ్యులు ఎలా అడుగుతారని అన్నారు. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్లను రెన్యువల్ చేయలేదని, వాలంటీర్లతో ఎన్నికలకు ముందు ఫేక్ రాజీనామాలు, ఫేక్ డ్రామాలు చేశారన్నారు. అధికారిక విధుల్లో లేరని డోలా చెప్పారు.
వాలంటీర్లను కొనసాగిస్తూ 2023 సెప్టెంబర్ తర్వాత జీవో ఎందుకు ఇవ్వలేదని, 2020 సెప్టెంబర్ 20న ఒక జీవో మార్చి 31, 2022 న మరో జీవో, 29 సెప్టెంబర్ 2022లో మరో జీవో విడుదల చేశారని చెప్పారు. 29 సెప్టెంబర్ 2022న ఇచ్చిన జీవోలో సెప్టెంబర్ 17, 2022 నుంచి ఆగస్టు 14, 2023 వరకు కొనసాగిస్తూ జీవో ఇచ్చారని చెప్పారు. 2023లో తిరిగి ఎందుకు కొనసాగిస్తూ జీవో జారీ చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ జీవో ఇచ్చి ఉంటే వారిని కొనసాగించే వారిమని చెప్పారు.
మంత్రి సమాధానంపై వైసీపీ సభా పక్ష నేత బొత్స మండలిలో నిలదీశారు. వాలంటీర్లపై ఎన్నికల్లో ఎలా హామీలిచ్చారని మంత్రి బొత్స నిలదీశారు. ఎన్నికల్లో రూ.5వేల గౌరవవేతనాన్ని రూ.10 పెంచుతామని చెప్పారని, వారిని కొనసాగించక పోతే ఇకపై కొనసాగించడం లేదని చెప్పాలన్నారు. తాము వాలంటీర్లను గతంలో రెన్యువల్ చేయకపోతే ఇప్పుడు మీరు చేయాలన్నారు.వాలంటీర్లను కొనసాగిస్తూ తాము ఉత్తర్వులు ఇవ్వకపోతే మీరు ఇవ్వడంలో అభ్యంతరం ఏముందన్నారు. తాము ఉత్తర్వులు ఇవ్వలేదని వారిని వదిలేయకుండా కొనసాగిస్తూ ఇప్పుడు మీరు ఇవ్వొచ్చన్నారు.