AP Senior Citizen Card : సీనియర్‌ సిటిజన్‌ కార్డుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే వెంటనే వెళ్లి తీసుకుంటారు!-how to get a senior citizen card in ap and what are the benefits ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Senior Citizen Card : సీనియర్‌ సిటిజన్‌ కార్డుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే వెంటనే వెళ్లి తీసుకుంటారు!

AP Senior Citizen Card : సీనియర్‌ సిటిజన్‌ కార్డుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే వెంటనే వెళ్లి తీసుకుంటారు!

Basani Shiva Kumar HT Telugu
Published Feb 08, 2025 10:11 AM IST

AP Senior Citizen Card : సీనియర్‌ సిటిజన్‌ కార్డు.. వృద్ధాప్యంలో ఇదో తోడు. ఈ కార్డు తీసుకుంటే అనేక రకాల సేవలను, ప్రభుత్వ పథకాలను వేగంగా, సులభంగా పొందవచ్చు. అంతేకాదు.. దీన్ని ఉచితంగానే ఇస్తారు. మరి ఆలస్యం ఎందుకు వెంటనే వెళ్లి ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి.

సీనియర్‌ సిటిజన్‌ కార్డు
సీనియర్‌ సిటిజన్‌ కార్డు

సీనియర్‌ సిటిజన్‌ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రభుత్వ సేవలను వేగంగా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా సులభంగా పొందే అవకాశం ఉంది. ఈ కార్డు లేనివారు దరఖాస్తు చేసుకుంటే ఉచితంగానే అందిస్తారు. ఎలాంటి రుసుము ఉండదు. ఈ కారడు ఉంటే.. ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపాల్సిన అవసరం లేకుండానే.. ప్రయోజనాలన్నీ పొందవచ్చు.

2006 నుంచి..

2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆఫీస్‌ మెమోరాండం జారీ చేసింది. అప్పటి నుంచీ ఇది అమలులో ఉంది. వృద్ధాప్యంలో కన్నబిడ్డల నిరాదరణకు గురైన వారికి, ఎవరూ లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు సీనియర్‌ సిటిజన్‌ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది.

ఎలా పొందాలి..

ఈ కార్డు కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ కాకపోతే.. జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయంలో కూడా పొందవచ్చు. జిల్లా కార్యాలయంలో అయితే.. దరఖాస్తు చేసుకున్న రోజే కార్డును ఇస్తారు. గ్రామాల్లో ఉన్న వారికి వారంలో కార్డు అందుతుంది. దరఖాస్తుకు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, వయసును నిర్ధారణ కోసం ఆధార్‌ కార్డు, బ్యాంకు అకౌంట్ పాస్ బుక్, ఇతర ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. ఈ సీనియర్‌ సిటిజన్‌ కార్డు.. దేశ వ్యాప్తంగా చెల్లుతుంది.

ప్రయోజనాలు ఏంటి..

ఈ కార్డు ఉంటే.. ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌లో 25 శాతం రాయితీ ఉంటుంది. దూర ప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులన్నిటిలో వృద్ధులకు రెండు సీట్లు రిజర్వ్‌ చేస్తారు. ఇక రైల్వే స్టేషన్లలో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్‌ కౌంటర్లు ఉంటాయి. అవసరమైన వారికి వీల్‌ఛైర్‌ సదుపాయం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, గర్భిణులకు లోయర్‌ బెర్త్‌ల రిజర్వేషన్‌ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో స్లీపర్‌ కోచ్‌లో ఆరు బెర్త్‌లు వీరికి కేటాయిస్తారు. థర్డ్‌ ఏసీలో నాలుగు, సెకెండ్‌ ఏసీలో మూడు బెర్త్‌లు రిజర్వ్‌ చేస్తారు. ఎవరు ముందుగా రిజర్వేషన్‌ చేసుకుంటే వారికి ఈ బెర్త్‌లను కేటాయిస్తారు.

ప్రత్యేక క్యూలైన్..

ఇటు బ్యాంకుల్లోనూ వీరికి ప్రత్యేక క్యూలైన్ ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్‌ ఉంటుంది. సర్వీసుల్లోనూ ప్రాధాన్యమిస్తారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 60-79 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇతరులకంటే అదనపు 0.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 80 ఏళ్లుపైబడిన వారికి 1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. కొన్ని బ్యాంకుల్లో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌లో 80 ఏళ్లుపైబడిన వారికి 8.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 60-79 ఏళ్ల మధ్య ఉన్న వారికి 7.9 శాతం వడ్డీరేటు లభిస్తుంది.

పన్ను మినహాయింపు..

2025-26 బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ప్రకారం.. 60 ఏళ్లు పైబడిన వారికి రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఉండనుంది. సీనియర్‌ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్‌ మినహాయింపు పరిమితి లక్ష రూపాయలకు పెంచారు.

Whats_app_banner