రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు.. ఆధార్‌తో పాటు వివాహ ధ్రువపత్రం జతచేసి సచివాలయాల్లో అందజేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. పెళ్లికార్డు ఉంటేనే మ్యారేజీ రిజిస్ట్రేషన్ పత్రం ఇస్తారు. అలాగే దరఖాస్తుకు జత చేసేందుకు చాలామంది మళ్లీ శుభలేఖలను ప్రింటింగ్ చేయించుకుంటున్నారు.
వివాహ ధ్రువీకరణ పత్రం కోసం.. దరఖాస్తు ఫారానికి భార్యాభర్తల ఆధార్ కార్డు, వయసు నిర్ధారణ ధ్రువీకరణ పత్రం, శుభలేఖ, వివాహ సమయంలో తీసుకున్న ఫొటోలు, ముగ్గురు సాక్షులు, కల్యాణ మండపం రసీదు, ఆలయాల్లో జరిగితే.. వారు ఇచ్చే రిజిస్ట్రేషన్ పత్రం, రూ.500 చలానా జత చేసి సబ్‌రిజిస్ట్రార్‌కు దరఖాస్తు ఇవ్వాలి. వివరాలు అన్నీ కరెక్ట్‌గా ఉంటే.. గంట వ్యవధిలో వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు.
గ్రామాల్లో, పట్టణాల్లో వివాహం జరిగిన వెంటనే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే.. అన్ని వివరాలను పరిశీలించి అక్కడే ధ్రువీకరణ పత్రాలను అందిస్తున్నారు. కానీ గడువు దాటిన వారు మాత్రం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచే పొందాల్సి ఉంటుంది. ఫొటోలు, ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లు, పురోహితుడి ధ్రువీకరణ, చలానా చెల్లింపు ఇలా.. మొత్తంగా రూ.1000 వరకు ఖర్చవుతోంది. దీనికి అదనంగా కొందరు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారుల అవతారమెత్తారు. మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం ఉన్నవారి నుంచి దళారులు రూ.3 వేలకు పైగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
హిందువుల సంగతి అలా ఉంటే.. ముస్లిం, క్రైస్తవులు వివాహ ధ్రువీకరణ పత్రం పొందాలంటే.. తక్కువలో తక్కువ రెండు నెలల సమయం పడుతుంది. వివాహ పత్రానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు నోటీసు బోర్డులో 30 రోజులు ప్రదర్శిస్తారు. దీనిపై అభ్యంతరాలు రాకుంటే అప్పుడు ధ్రువీకరణ పత్రం ఇస్తారు. కానీ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం జూన్ 7 వరకు మాత్రమే ఉంది. దీంతో ముస్లిం, క్రిస్టియన్లలో ఆందోళన వ్యక్తం అవుతుంది.
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు వివాహ రిజిస్ట్రేషన్ పత్రం నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చే అవకాశం ఉందని.. డీఎస్‌వోలు చెబుతున్నారు. ఇటీవల పౌరసరఫరాల కమిషనర్‌తో జరిగిన సమావేశంలో ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రత్యామ్నాయంగా శుభలేఖ, ఫొటో వంటి ఆధారాలు తీసుకునేలా సడలింపు ఇస్తామన్నారు. కానీ దీనిపై ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదు. దీంతో దరఖాస్తుదారులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
సంబంధిత కథనం