AP Ration Card Status Check : రేష‌న్ కార్డు ఈకేవైసీ స్టేట‌స్ తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇలా చేయండి-how to check ration card ekyc status in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ration Card Status Check : రేష‌న్ కార్డు ఈకేవైసీ స్టేట‌స్ తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇలా చేయండి

AP Ration Card Status Check : రేష‌న్ కార్డు ఈకేవైసీ స్టేట‌స్ తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇలా చేయండి

HT Telugu Desk HT Telugu

AP Ration Card Status Check : సంక్షేమ ప‌థ‌కాలకు ఆధార్ కార్డుతో పాటు రేష‌న్ కార్డు కొల‌మానంగా ఉంది. రేష‌న్ కార్డు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈకేవైసీ న‌మోదు జ‌రుగుతోంది. ఏప్రిల్ 30తో గ‌డువు ముగియ‌నుంది. ఈలోపు ఈకేవైసీ చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచిస్తోంది.

రేషన్ కార్డు ఈకేవైసీ స్టేటస్ చెక్

రేష‌న్ కార్డుకు ఈకేవైసీ అయిందో లేదో తెలుసుకోవ‌డానికి చాలా ఇబ్బందులు ప‌డుత‌న్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే 1.48 కోట్ల తెల్ల రేష‌న్ కార్డులు ఉన్నాయి. దాదాపు 7.55 ల‌క్ష‌ల మంది ల‌బ్ధిదారులు ఇంత‌వ‌ర‌కు రేష‌న్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ న‌మోదు చేసుకోలేదు. ఇప్పుడు స‌మ‌స్య అంతా ఎవ‌రికి ఈకేవైసీ అవ్వ‌లేదో.. ఎవ‌రికి అయిందో తెలియ‌టం లేదు. దీంతో ప్ర‌జ‌లు రేష‌న్ షాప్‌లు, స‌చివాల‌యాల వ‌ద్ద క్యూలైన్ల క‌డుతున్నారు. క్యూలైన్ల‌లో నిలబ‌డి గంట‌ల త‌ర‌బ‌డి వేచి చూస్తూ.. ఈకేవైసీ చేసే క్ర‌మంలో కొంత మందికి అప్ప‌టికే ఈకేవైసీ అప్‌డేట్ అయి ఉంటుంది. అందుకే ఈకేవైసీ అయిందా? లేదా? అనేది తెలుసుకోవ‌డానికి ఈ కింది ప్ర‌క్రియ‌ను అనుస‌రించండి.

ఇలా తెలుసుకోవాలి..

ఈకేవైసీ స్టేట‌స్‌ను ఆన్‌లైన్‌లోనే సొంతంగానే తెలుసుకోవ‌చ్చు. రేష‌న్ డీల‌ర్‌, ఎండీయూ వాహ‌నంలో ఈపోస్ యంత్రంలో మీ రేష‌న్ కార్డు వివరాలు న‌మోదు చేస్తే స‌భ్యుల వివ‌రాల‌న్నీ వ‌స్తాయి. ఎరుపు రంగు గ‌డియ‌లో పేర్లు ఉంటే ఈకేవైసీ అప్‌డేట్ కాన‌ట్లే. అదే ఆకుప‌చ్చ రంగులో ఉంటే వారిది ఈకేవైసీ పూర్తి అయిన‌ట్లే. ఎరుపు రంగు గ‌డిలో పేరు ఉన్న‌వారు వేలిముద్ర వేస్తే వారి ఈకేవైసీ పూర్తి అవుతుంది.

సెర్చ్ ఇలా..

ఆన్‌లైన్‌లో ఈకేవైసీ స్టేట‌స్‌ను చెక్ చేయాలంటే.. epds.ap.gov.in అని టైప్ చేసి ఎంట‌ర్ కొట్టాలి. అప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ క‌న్స్యూమ‌ర్ అఫైర్స్‌, ఫుడ్ అండ్ సివిల్ స‌ప్లైస్‌ ఏపీ అనే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఈపీడీఎస్ అని ఉంటుంది. దానిలో రేష‌న్ కార్డు విభాగంలో ఆరు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. అందులో "epds application search", "rice card search" అని ఉంటాయి. ఆ రెండింటిలో ఒక అప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.

ఈనెల 30 వరకే గడువు..

అందులో రేష‌న్ కార్డు నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. అప్పుడు రేష‌న్ కార్డులోని ల‌బ్ధిదారుల పేర్లు వ‌స్తాయి. అందులో పేర్ల ఎదురుగా చివ‌రిలో ఎస్ అని ఉంటే ఈకేవైసీ అయిన‌ట్లు, నో అని ఉంటే ఈకేవైసీ కాన‌ట్లు. ఈకేవైసీ కాక‌పోతే వేలిముద్ర వేస్తే ఈకేవైసీ అవుతుంది. డీల‌ర్‌, ఎండీయూ వాహ‌నాల వ‌ద్ద ఈ పోస్ యంత్రంలో వేలి ముద్ర వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఏప్రిల్ 30 వ‌ర‌కు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఐదేళ్ల లోపు, 80 ఏళ్ల పైబ‌డిన వారికి ఈకేవైసీ అవ‌స‌రం లేద‌ని. మిగిలిన వారు త‌ప్ప‌ని స‌రిగా ఈకేవైసీ చేసుకోవాల‌ని సివిల్ స‌ప్లైయిస్ డిపార్ట్‌మెంట్ స్ప‌ష్టం చేసింది.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

 

HT Telugu Desk

సంబంధిత కథనం