AP GPS Gazzette: జిపిఎస్ గెజిట్ ఎలా జారీ చేశారు? గెజిట్ జారీ వ్యవహారంపై విచారణ జరపాలన్న చంద్రబాబు
AP GPS Gazzette: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ గెజిట్ జారీ కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. జిపిఎస్ నిలిపివేయాలని స్పష్టం చేశారు.

AP GPS Gazzette: ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలంటూ జారీ చేసిన జీవో, గెజిట్‌లను వెంటనే ఆపాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్యారెంటీ పెన్షన్ స్కీమ్(జీపీఎస్) జీవో, గెజిట్‌లను నిలిపివేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. జీపీఎస్ గెజిట్ జారీ కావడంపై ఆయన ఆరా తీశారు.
ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా గెజిట్‌ను ఇప్పుడెందుకు విడుదల చేశారో విచారించాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఉద్యోగుల అభ్యంతరాలను పట్టించుకోకుండా వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీవోను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాక అధికారులను సోమవారం ఆదేశించారు.
జీపీఎస్ అమలుపై గెజిట్ జారీ చేయడంపై ఉద్యోగ సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో ఆర్థిక శాఖ సమీక్షలో జీపీఎస్ అంశంపై ఆరా తీశారు. గెజిట్ జారీ చేయడంపై అధికారులను చంద్రబాబు ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో తీసుకున్న ప్రతిపాదనలపై ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేయడంపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండగా, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా గెజిట్ జారీ చేయడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గెజిట్ జారీ కావడంపై విచారణ జరపాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్‌పై ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సమాచారం లేకుండానే గత వారం గెజిట్ జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు చేసేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సెలవుపై వెళ్లే సమయంలో జీపీఎస్‌కు అమోదం తెలిపారు. జూన్ 12వ తేదీన ఆర్థిక శాఖ దీనిపై జీవో 54విడుదల చేసింది. రావత్ పేరిట ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ఆధారంగా గత వారం గెజిట్ జారీ చేశారు. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీకి భిన్నంగా జీపీఎస్ చట్టం చేయడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. తాజాగా గెజిట్ నిలిపివేయాలని చంద్రబాబు ఆదేశించడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సీపీఎస్ ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు పోరాటాలు చేసినా బలవంతంగా జీపీఎస్ చట్టాన్ని తీసుకొచ్చారని, ప్రభుత్వం మారే సమయంలో గెజిట్ జారీ చేయడంపై ఉద్యోగుల ఆందోళన పరిగణలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశాయి.
జిపియస్ అమలుపై ఇచ్చిన జిఓ నిలిపివేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంపై ఏపీజేఏసీ అమరావతి హర్షం వ్యక్తం చేసింది. పాత ప్రభుత్వ హయంలో ఏదైనా నిర్ణయం తీసుకుని, సదరు నిర్ణయం పై ఎన్నికల నోటిఫికేషన్ లోపు ఉత్తర్వులు జారీ కాకపోతే, కొత్తగా వచ్చిన ప్రభుత్వ అనుమతితో మాత్రమే ఉత్తర్వులు ఇవ్వాలని రూల్స్ స్పష్టంగా చెబుతున్నా, కొత్త ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేకుండా జూన్12న గుట్టు చప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరాయి.