Vinukonda Murder: నడిరోడ్డుపై నరికేశాడు, వినుకొండలో ఘోరం, రాజకీయ కక్షలతో దారుణ హత్య, వైరల్‌గా మారిన వీడియో-horror in vinukonda the brutal murder with political factions the video went viral ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vinukonda Murder: నడిరోడ్డుపై నరికేశాడు, వినుకొండలో ఘోరం, రాజకీయ కక్షలతో దారుణ హత్య, వైరల్‌గా మారిన వీడియో

Vinukonda Murder: నడిరోడ్డుపై నరికేశాడు, వినుకొండలో ఘోరం, రాజకీయ కక్షలతో దారుణ హత్య, వైరల్‌గా మారిన వీడియో

Sarath chandra.B HT Telugu
Jul 18, 2024 09:06 AM IST

Vinukonda Murder: వినుకొండలో దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై, జనం చూస్తుండగానే ఓ వ్యక్తిని మరొకరు దారుణంగా హత్య చేశాడు. రాజకీయ విభేదాలతోనే ఈ హత్య జరగడంతో పల్నాడు ఉలిక్కిపడింది.

వినుకొండలో యువకుడి దారుణ హత్య
వినుకొండలో యువకుడి దారుణ హత్య

Vinukonda Murder: పల్నాడులో బుధవారం రాత్రి జరిగిన హత్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రాంతంలో ఓ యువకుడిని నడిరోడ్డుపై నరికేశారు. ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తతలతో రగిలిపోయిన పల్నాడులో పోలీసుల కఠిన చర్యలతో కొంత కాలంగా ప్రశాంతంగా ఉంది. జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్‌ను మార్చిన రెండ్రోజుల్లోనే దారుణ హత్య చోటు చేసుకుంది.

హత్యకు గురైన వ్యక్తి వైసీపీ కార్యకర్త కాగా, హత్యకు పాల్పడింది టీడీపీ సానుభూతి పరుడిగా ప్రచారం జరిగింది. రాజకీయ విభేదాలతోనే హత్య జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. నడిరోడ్డుపై హత్య జరుగుతుండగా ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా కొందరు వీడియోల్లో ఘటనను రికార్డ్ చేశారు. హత్య జరిగిన సమయంలో వందలాది మంది ఘటనా స్థలంలో ఉన్నా, ఎవరు దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. చుట్టూ చేరి వినోదం చూశారు. ఒళ్లు జలదరించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వైసీపీకి చెందిన షేక్ అబ్దుల్ రషీద్‌ బుధవారం రాత్రి 7.30కు ఇంటికి వెళ్తుండగా టీడీపీ కార్యకర్త జిలానీ మరో ఇద్దరితో కలిసి దాడి చేశాడు. వినుకొండ తెలుగు యువత నాయకుడు ఎస్‌.కె.జానీ తమ్ముడైన జిలానీ మరో ఇద్దరు ముండ్ల మూరు బస్టాంట్‌ వద్ద మాటువేసి దాడికి దిగారు. అయితే జిలానీ తమ పార్టీ నాయకుడు కాదని టీడీపీ నేతలు చెబుతున్నారు. హతుడు, నిందితుడు ఇద్దరు వైసీపీకి చెందిన వారేనని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. 

హత్యకు గురైన వ్యక్తితో పాటు నిందితుడు  వినుకొండ రౌడీ షీటర్ పీఎస్ ఖాన్ అనుచరులుగా చెబుతున్నారు.  ఇద్దరూ గతంలో  సజ్జల భార్గవ రెడ్డితో సోషల్ మీడియాలో పని చేసేవారని ఆరోపిస్తున్నారు. 

కొబ్బరి బొండాల కత్తితో దాడి…

నిందితుడు కొబ్బరి బొండాల కత్తితో దాడిచేయడంతో మృతుడి చేయి తెగి దూరంగా పడిపోయింది.దాడి నుంచి కాపాడుకోడానికి రెండు చేతులు అడ్డు పెట్టడంతో అవి తెగి పడిపోయాయి. కిందపడిపోయిన రషీద్‌పై నిందితుడు విచక్షణా రహితంగా కత్తితో నరికాడు. ఈ దృశ్యాలను స్థానికులు కెమెరాలలో రికార్డ్ చేశారు. అవి వైరల్‌గా మారాయి. హత్య తర్వాత నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.

జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు హత్య జరిగిన సమయంలో వినుకొండలోనే ఉన్నారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగిందని వ్యాఖ్యానించడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడులో లోపించిన శాంతి భద్రతలకు తాజా ఘటన అద్ధం పడుతోందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలో 31 హత్యలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపించారు.

ఎన్డీఏ కూటమి వేధింపులు తాళలేక 35మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, 1050 దాడులు జరిగాయని, రెడ్‌బుక్‌ పేరుతో అరాచకం సృష్టిస్తున్నారని, ఆ పార్టీ నేతలు అంబటిరాంబాబు, అంజాద్ భాషా, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్త హత్య ప్రభుత్వ హత్యేనని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మండిపడ్డారు.

వద్దని పదేపదే చెబుతున్నా….

హింస, కక్ష సాధింపులు వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నా, రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు మొదలుకుని పట్టణాల వరకు రాజకీయ కక్షలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ వైరంతో రగిలిపోతున్న ముఠాలు అదను కోసం ఎదురు చూస్తూ దాడులకు తెగబడుతున్నాయి. గత ప్రభుత్వ హయంలో తమను వేధించారనో, అణిచివేశారనో భావనతో ప్రభుత్వం మారిన వెంటనే ప్రత్యర్థులపై కక్ష సాధింపులకు తెగబడుతున్నారు. ప్రత్యర్థుల్ని విచక్షణారహితంగా దాడులు చేస్తూ ప్రతీకారాలు తీర్చుకునే పనిలో ఉన్నారు.

ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమైన పల్నాడులో కొన్నేళ్లుగా శాంతి భద్రతలు క్షీణించాయి. రాజకీయ వైరాలతో ముఠాలు చెలరేగిపోతున్నాయి. రాజకీయం, పార్టీ ప్రాబల్యాన్ని పెంచుకునే పేరుతో నేరగాళ్లను అన్ని పార్టీలు ప్రోత్సహించడంతో ఈ పరిస్థితి దాపురించింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన క్రిమినల్ నాయకులు చెలరేగిపోతున్నారు.

ఈ ఘటనల్లో ప్రధాన నాయకులు సురక్షితంగానే ఉంటున్నా వారి వెనుక తిరిగే అమాయకులు బలైపోతున్నారు. ఆధిపత్యం కోసం తమ వారిని రెచ్చగొట్టి ప్రత్యర్థులపై దాడులకు ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చంద్రబాబు ప్రభుత్వంపై ఉంది.

శాంతి భద్రతలపై శ్వేతపత్రం…

ఏపీ సీఎం చంద్రబాబు  నేడు శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. గత ఐదేళ్లలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందనే దానిపై  శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు నాలుగు శ్వేత పత్రాలను చంద్రబాబు విడుదల చేశారు. 

Whats_app_banner