Konaseema Murder: కోన‌సీమ జిల్లాలో ఘోరం, భార్య‌తో వివాహేత‌ర సంబంధం ఉంద‌నే అనుమానంతో స్నేహితుడిని హ‌త్య-horrific murder in konaseema district man murdered by his friend with extra marital affair ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Konaseema Murder: కోన‌సీమ జిల్లాలో ఘోరం, భార్య‌తో వివాహేత‌ర సంబంధం ఉంద‌నే అనుమానంతో స్నేహితుడిని హ‌త్య

Konaseema Murder: కోన‌సీమ జిల్లాలో ఘోరం, భార్య‌తో వివాహేత‌ర సంబంధం ఉంద‌నే అనుమానంతో స్నేహితుడిని హ‌త్య

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 08, 2025 10:32 AM IST

Konaseema Murder: అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాలో ఘోర‌మైన సంఘట‌న చోటు చేసుకుంది. త‌న భార్య‌తో వివాహేత‌ర సంబంధం ఉంద‌నే అనుమానంతో స్నేహితుడిని ఒక వ్య‌క్తి హ‌త్య చేశాడు. బ్లేడ్‌తో పీక కోసి బుర‌ద‌లో తొక్కేశాడు. అనంత‌రం పోలీసుల‌కు లొంగిపోయాడు. పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.

వివాహేతర సంబంధం అనుమానంతో స్నేహితుడి  హత్య
వివాహేతర సంబంధం అనుమానంతో స్నేహితుడి హత్య (photo source from unshplash,com)

Konaseema Murder: కోనసీమ జిల్లాలో వివాహేతర సంబంధం అనుమానంతో దారుణ హత్య జరిగింది. నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘ‌ట‌న బి.ఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా కె.గంగ‌వ‌రం మండ‌లం కూళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కె.గంగ‌వ‌రం మండ‌లం కూళ్ల గ్రామానికి చెందిన స‌త్తి శివ‌న్న రత్నం (32), మంచాల సురేష్ ఇద్ద‌రూ స్నేహితులుగా ఉన్నారు.

yearly horoscope entry point

ఇద్ద‌రూ క‌లిసి తాపీప‌ని చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. ప్ర‌తి రోజూ ఇద్ద‌రూ ఒకే చోట ప‌ని చేస్తుంటారు. ఇద్ద‌రూ క‌లిసే మ‌ద్యం సేవిస్తుంటారు. ఒక‌రికి ఒక‌రు చేదోడు వాదోడుగా కూడా ఉంటారు. అయితే త‌న భార్య‌తో స‌త్తి శివ‌న్న రత్నంకు వివాహేత‌ర సంబంధం ఉంద‌ని సురేష్ అనుమానించాడు. సోమ‌వారం తాపీ ప‌ని‌కి క‌లిసే వెళ్లి తిరిగి వ‌స్తూ పామ‌ర్రు గ్రామంలో మ‌ద్యం కొనుగోలు చేసుకుని గ్రామానికి వ‌చ్చారు.

గ్రామానికి స‌మీపంలో ఇద్ద‌రూ మ‌ద్యం సేవించారు. మ‌ద్యం సేవించిన అనంత‌రం ఇద్ద‌రి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. స‌త్తి శివ‌న్న రత్నంకు భార్య‌తో వివాహేత‌ర సంబంధం ఉంద‌నే అనుమానంతో వారిద్ద‌రి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్నారు. ప‌క్క‌నే ఉన్న పంట బోదెలోని శివ‌న్నను సురేష్ తోసేశాడు. వెంట‌నే తాను తెచ్చుకున్న బ్లేడుతో పీక కోసి బుర‌ద‌లో తొక్కేశాడు. అనంత‌రం గంగ‌వ‌రం పోలీసుల‌కు లొంగిపోయారు.

త‌న భార్య‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడ‌నే ఆలోచ‌న‌తో త‌న స్నేహితుడి మ‌ట్టుపెట్టాల‌ని సురేష్ భావించాడు. అలాగే సాధార‌ణంగా తామిద్ద‌రం క‌లిసి తాగే స‌మ‌యంలో అంత‌మెందించాల‌ని భావించి అందుకు ప్ర‌ణాళిక ర‌చించుకున్నాడు. ప్ర‌ణాళిక‌లో భాగంగానే త‌న‌తో పాటు బ్లేడు తీసుకెళ్లాడు. మ‌ద్యం తాగిన త‌రువాత స్నేహితుడు శివ‌న్న‌తో గొడ‌వ పెట్టుకున్నాడు. గొడ‌వ‌లో భాగంగానే పంట బోదెలో ప‌డేసి, తాను తెచ్చుకున్న బ్లేడుతో పీక కోసి, బుర‌ద‌లో తొక్కేశాడు. అనంత‌రం పోలీసుస్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఇదంతా ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే జ‌రిగింద‌ని పోలీసులు భావిస్తున్నారు.

విష‌యం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ స‌భ్యులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని బుర‌ద‌లో ఉన్న శివ‌న్న‌ను బ‌య‌ట‌కు తీశారు. వెంట‌నే పామ‌ర్రులోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)కి త‌ర‌లించారు. అయితే వైద్యులు ప‌రీక్షించి అప్ప‌టికే శివ‌న్న మృతి చెందిన‌ట్లు నిర్ధారించారు.

దీనిపై రామ‌చంద్ర‌పురం ఇన్‌చార్జి డీఎస్పీ సీఎస్ఆర్‌కే ప్ర‌సాద్‌, ఇన్‌చార్జి సీఐ దొర‌రాజు, కె.గంగ‌వ‌రం ఎస్ఐ జానీ బాషా మాట్లాడుతూ జ‌రిగిన హ‌త్య ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశామ‌ని, సురేష్ భార్య‌తో వివాహేత‌ర సంబంధం ఉంద‌నే అనుమానంతో శివ‌ను చంపాడ‌ని పేర్కొన్నారు. ఈ కేసును స‌మగ్రంగా విచారించి, నిందితుడిని కోర్టు త‌ర‌లిస్తామ‌ని అన్నారు. శివ‌న్న మృతితో ఆయన కుటుంబ స‌భ్యులు రోద‌న‌లు మిన్నంటాయి. బంధువులు క‌న్నీరుమున్నీరు అయ్యారు. ఈ ఘ‌ట‌న‌ కూళ్ల గ్రామంలో క‌ల‌కలం సృష్టించింది.

(జ‌గదీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner