పిఠాపురంలో ఘోరం.. కూతురి రెండో పెళ్లికి అడ్డొస్తుందని, ఐదు నెలల పసికందు దారుణ హత్య-horrific incident in pithapuram five month old baby brutally murdered ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  పిఠాపురంలో ఘోరం.. కూతురి రెండో పెళ్లికి అడ్డొస్తుందని, ఐదు నెలల పసికందు దారుణ హత్య

పిఠాపురంలో ఘోరం.. కూతురి రెండో పెళ్లికి అడ్డొస్తుందని, ఐదు నెలల పసికందు దారుణ హత్య

Sarath Chandra.B HT Telugu

కుటుంబం పరువు పేరుతో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. తన కుమార్తెకు రెండో పెళ్లి చేయడానికి ఐదు నెలల పసికందును హత్య చేశారు. కన్న తల్లి కూడా ఈ దారుణానికి సహకరించింది. పిఠాపురంలో జరిగిన ఈ ఘటనలో నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పిఠాపురంలో ఘోరం, ఐదు నెలల పసికందును చంపేసిన అమ్మ, అమ్మమ్మ

కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని ఓ బిడ్డకు జన్మనివ్వడాన్ని అవమానంగా భావించిన మహిళ.. పసికందును అడ్డు తొలగించుకుంటే కూతురికి రెండో పెళ్లి చేయొచ్చని భావించింది. అమ్మ, అమ్మమ్మ కలిసి ఐదు నెలల పసికందును చంపేసి బావిలో పడేశారు. చివరకు పోలీసుల విచారణలో దొరికి పోయారు.

రెండో పెళ్లికి అడ్డుగా ఉందని ఐదునెలల పసికందును గొంతు నులిమి చంపేసి బావిలో పడేసిన ఘటనలో తల్లితో పాటు అమ్మమ్మను నిందితులుగా గుర్తించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని జగ్గయ్యచెరువు కాలనీలో గత వారం జరిగిన ఘటనలో నిందితులను పోలీసులు గుర్తించారు.

మే 6వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఐదు నెలల చిన్నారి యశ్వితను గొంతునులిమి చంపేసి ఇంటి వెనుక భాగంలో ఉన్న నూతిలో పడేశారు. ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కన్న తల్లితో పాటు, అమ్మమ్మలను హంతకులుగా తేల్చారు. చిన్నారిని గొంతు నులిమి హత్య చేసినట్టు అంగీకరించడంతో వారిద్దరినీ అరెస్టు చేసినట్టు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్‌ సోమవారం వివరించారు.

జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన పసుపులేటి శైలజ, పిఠాపురం మండలం నరసింగపురం గ్రామానికి చెందిన పెదపాటి సతీష్‌ ఇంట్లో పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఐదు నెలల క్రితం యశ్విత జన్మించింది.

పెళ్ళి తర్వాత తనను అత్తవారింటికి తీసుకు వెళ్లకపోవడం, పాప పుట్టిన తర్వాత కూడా భర్త తరపు బంధువులు ఎవరూ చూడ్డానికి రాకపోవడంతో తల్లిదండ్రులు చెప్పినట్టు మేనత్త కొడుకుని వివాహం చేసుకుంటే బాగుండేదని శైలజ భావించింది. రెండో పెళ్లికి చిన్నారి అడ్డుగా ఉందని, పసిబిడ్డను అడ్డు తొలగిస్తే రెండో పెళ్లి చేసుకోవచ్చని తల్లీ కుమార్తెలు భావించారు. అనుకున్నదే తడవుగా గొంతు నులిమి చంపేశారు.

ఆ తర్వాత ఏమి తెలియనట్టు కుమార్తె కనిపించడం లేదని భర్తకు సమాచారం ఇచ్చారు. ఈ వ్యవహారంపై తన కుమార్తె యశ్వితను ఎవరో చంపేసి, బావిలో పడేశారని నరసింగపురానికి చెందిన పెదపాటి సతీష్ పోలీసులకు ఈ నెల 6న అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. మరుసటిరోజు ఉదయం బావిలో మృత శిశువును గుర్తించారు

పసికందు తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటనపై విచారణ జరపడంతో అసలు నిజాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే శైలజ, ఆమె తల్లి అన్నవరం కలిసి చిన్నారిని హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఇతర కుటుంబసభ్యుల పాత్రపై లోతుగా విచారణ జరుపుతున్నట్టు సీఐ వివరించారు.

సొంత కులం వాడితో పెళ్లి చేయాలని…

పిఠాపురానికి చెందిన పసుపులేటి అన్నవరం స్థానికంగా కుల పెద్దగా వ్యవహరిస్తుం టుంది. రెండేళ్ల క్రితం శైలజ ఇంటి నుంచి వెళ్లిపోయి కులాంతర వివాహం చేసుకుంది. ఈక్రమంలో శైలజ మనసు మార్చి తన కులస్థుడికే ఇచ్చి రెండో పెళ్లి చేయాలని అన్నవరం భావించింది. అత్తింటి వారు ఆదరించక పోవడంతో శైలజ కూడా దానికి అంగీకరించింది.

ఈ నెల 6న పసికందు యశ్వితను అన్నవరం, శైలజ కలిసి గొంతు నులిమి చంపేసి పక్కింట్లో ఉన్న బావిలో పడేశారు. క్షుద్రపూజలు చేసినట్టు నమ్మించేందుకు ఇంటిముందు పసుపు, కుంకుమ చల్లి నిమ్మకాయలు పెట్టారు. పోలీసుల విచారణలో దొరికిపోయారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం