Guntur Crime: కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన తండ్రికి స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన గుంటూరులో వెలుగు చూసింది. ఈ ఘటనపై భర్తపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని ఒక గ్రామంలో సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెనాలి మండలంలోని ఒక గ్రామంలో భార్య, భర్తలకు 13, 11 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త (40) గుంటూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం నుంచి శుక్రవారం వరకు గుంటూరులోనే ఉంటూ వారానికి రెండు రోజులు స్వగ్రామానికి వస్తాడు. రెండేళ్లుగా భార్య దుగ్గరాల మండలంలోని తన పుట్టింట్లోనే ఉంటూ కుమార్తెలను చదివించుకుంటుంది.
భర్త వారాంతాల్లో ఇంటికి వచ్చినప్పుడు ఆయన దగ్గరకు భార్య, పిల్లలు వెళ్తుండే వారు. భర్త గుంటూరు వెళ్లిన తరువాత భార్య, పిల్లలు అక్కడి నుంచి దుగ్గిరాల మండలం వెళ్లిపోతారు. ఈ క్రమంలో గత వారం కూడా భర్తతో కలిసి భార్య, పిల్లలు స్వగ్రామానికి వెళ్లారు. భర్తకు సోమవారం కూడా సెలవు కావడంతో అక్కడే ఉన్నారు. ఆదివారం రాత్రి భర్త ఫుల్‌గా మద్యం సేవించాడు. అందరూ ఒకే రూమ్‌లో నిద్రించారు. సోమవారం వేకువజామున కాల కృత్యాలు తీర్చుకునేందుకు భార్య బయటకు వెళ్లింది.
ఇదే అదునుగా భావించిన నిందితుడు పెద్ద కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన భార్య ఆ ఘటన చూసి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. గతంలో కూడా తండ్రి రెండు సార్లు ఇలానే చేశాడని తల్లికి కుమార్తె కన్నీరుమున్నీరై విలపిస్తూ చెప్పుకుంది. దీంతో సోమవారం కుమార్తెతో కలిసి తెనాలి రూరల్ పోలీస్‌స్టేషన్ ఆశ్రయించారు.
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు తండ్రిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా సెక్షన్‌లు మార్చే అవకాశం ఉందని తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్ తెలిపారు.
తెనాలిలోనే మరో ఘటన చోటు చేసుకుంది. బాలికపై దుగ్గిరాలకు చెందిన వ్యక్తి లైంగిక దాడికి యత్నించారు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఆ కామాంధుడు చెర నుంచి బాలికను రక్షించారు. అనంతరం నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
సోమవారం సాయంత్రం ఒక మైనర్ బాలిక సైకిల్‌పై తెనాలి మండలం బుర్రిపాలెం వెళ్తుంది. మార్గంమధ్యలో కంపోస్టు యార్డ దాటిన తరువాత బాలికను దుగ్గిరాలకు చెందిన బొక్కెన రవి అటకాయించాడు. బాలికను ఎత్తుకుని పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఆమెపై లైంగిక దాడికి యత్నించగా, ఆమె భయంతో కేకలు వేసింది. బాలిక కేకలు విన్న చట్టు పక్కల వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ దుర్మార్గుడి చెర నుంచి బాలికను విడిపించారు.
అనంతరం నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని పోలీసులు అప్పగించారు. నిందితుడిని తెనాలి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తాపీ పనులు చేస్తాడు. అతడు పూర్తి మద్యం మత్తులు ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు).
సంబంధిత కథనం