Eluru Crime: ఏలూరులో ఘోరం, సోదరి వరుసైన బాలికపై అత్యాచార యత్నం, తప్పించుకున్న బాలిక
Eluru Crime: ఏలూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలికపై వరుసకు అన్నలైన ఇద్దరు మద్యం, గంజాయి మత్తులో అత్యాచారానికి యత్నించారు.మాయమాటలు చెప్పి బలవంతంగా వాహనంపై తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు.

Eluru Crime: ఏలూరు జిల్లాలో హేయమైన సంఘటన చోటు చేసుకుంది. బాలికపై వరుసకు అన్నలైన ఇద్దరు యువకులు మద్యం, గంజాయి మత్తులో అత్యాచారానికి యత్నించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన సమయంలో ఆమెను వెంబడించి, మాయ మాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి యత్నించారు. అయితే అతి కష్టం మీద బాలిక ఆ దుర్మార్గుల చెర నుంచి తప్పించుకుని బయటపడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఈ ఘటన ఏలూరు జిల్లా నూజివీడులో శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూజివీడులోని ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒక బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమెకు అన్న వరుస అయ్యే పాటిబండ్ల సంతోష్, ముల్లంగి ప్రదీప్‌లతో కాస్తా పరిచయం ఉంది.
ఈ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఆ బాలికపై ఇద్దరూ కన్నేశారు. అయితే ప్రతిరోజూలానే శనివారం ఉదయం కూడా బాలిక కాలేజీకి వెళ్లింది. కాలేజీ ముగిసిన తరువాత సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో ఆమెను కాలేజీ నుంచే అన్నయ్య వరుసైయ్యే పాటిబండ్ల సంతోష్, ముల్లంగి ప్రదీప్‌లు వెంబడించారు.
అయితే ఇంటి సమీపంలోకి వచ్చే సరికి బాలికకు మాయ మాటలు చెప్పారు. ఆ తరువాత ఆమె వద్ద నున్న పుస్తకాల బ్యాగ్‌ను తీసుకుని ఆమె స్నేహితురాలైన వేరొక అమ్మాయికి అందించారు. అనంతరం బలవంతంగా ఆమెను ద్విచక్ర వాహనం ఎక్కించి తీసుకెళ్లిపోయారు. నూజివీడులోని అజరయ్యపేటలో ఉన్న సమాధుల వైపు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లారు. మద్యం, గంజాయి మత్తులో ఉన్న వారిద్దరూ ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించారు.
అయితే బాలిక వారిని ప్రతిఘటించే క్రమంలో పెనుగులాడి పెద్ద పెద్ద కేకలు వేసింది. వారి వద్ద నుంచి తప్పించుకుని బయటపడింది. అనంతరం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు జరిగిన విషయం వివరించింది. దీంతో కుటుంబ సభ్యులు నూజివీడు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తమ బాలికపై పాటిబండ్ల సంతోష్, ముల్లంగి ప్రదీప్‌లు అఘాయిత్యానికి యత్నించారని ఫిర్యాదు చేశారు.
దీంతో ఆ ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు. నూజివీడు టౌన్ ఎస్ఐ జ్యోతిబాసు స్పందిస్తూ తమకు ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికపై అత్యాచారానికి యత్నించినట్లు ఫిర్యాదు వచ్చిందని, నిందితులపై పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు. అలాగే గాలింపు చర్యలు చేపట్టి, నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఈ కేసు పోక్సో చట్టం కింద నమోదు చేయడంతో డీఎస్పీ స్థాయి అధికారి విచారించాల్సి ఉంటుందని, కనుక తదుపరి ప్రక్రియ మొత్తం డీఎస్పీ పర్యవేక్షణలో ఉంటుందని అన్నారు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిందితులకు వైద్య పరీక్షలు చేయించాలని, అప్పుడే వారు మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు తీసుకున్నట్లు వెల్లడవుతుందని అన్నారు. అయితే పోలీసులు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించలేదని, పోలీసుల తీరు తమకు అనుమానంగా ఉందని తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం