Anantapur Crime: అనంతపురం జిల్లాలో ఘోరం...వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
Anantapur Crime: అనంతపురం జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని ప్రియుడితో కలిసి భర్తను భార్య హతమార్చింది. ఎవరికీ అనుమానం రాకుండా భార్య పోలీసులకు ఫోన్ చేసి తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని చెప్పింది.

Anantapur Crime: అనంతపురంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసిన ఘటన వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు నేరస్తురాలు భార్యనే అని తెలుసుకున్నారు. మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడు, మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మవరం మండలం మల్కాపురానికి చెందిన దేవరకొండ కాశప్ప, సౌభాగ్య భార్యాభర్తలు. రెండేళ్లుగా కక్కలపల్లి టమాటా మండీలో కాశప్ప కూలీలకు మేస్త్రీగా ఉన్నాడు. భర్త కాశప్ప రెండు నెలల క్రితం పొలం అమ్మగా వచ్చిన డబ్బు తీసుకుని చీరల వ్యాపారం చేయడానికి హైదరాబాద్‌కు వెళ్లాడు.
వ్యాపారం చేస్తూ అక్కడే ఉండేవాడు. భార్య సౌభాగ్య మాత్రం టమాటా మండీలో కూలీల మేస్త్రీగా పని చేసేది. రెండు నెలల క్రితం కర్ణాటకలోని కోలార్‌కు చెందిన నవాజ్‌బేగ్, గౌస్‌పీర్‌లు ఆమె కూలీలుగా చేరారు.
ఈ క్రమంలో సౌభాగ్య, నవాజ్ బేగ్‌ల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కూలీలతో పాటు భర్త కాశప్పకు కూడా తెలిసింది. దీంతో భార్య, భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తరచూ గొడవులు జరుగుతూనే ఉన్నాయి. అయితే తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య తన ప్రియుడితో భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. మీ స్నేహితుడు గౌస్‌పీర్‌తో కలిసి హత్య చేయాలని నవాజ్ బేగ్‌కు సూచించింది. ఫిబ్రవరి 1న నేషనల్ హైవే 44కి సమీపంలో చింతతోపు వద్ద నిందితులు నవాజ్ బేగ్, గౌస్‌పీర్‌లు మద్యం తాగడానికి కాశప్పను ఆహ్వానించారు.
కాశప్ప మద్యం ఫుల్‌గా తాగి మత్తులోకి జారుకున్న తరువాత ఖాళీ బీరు సీసాలు, బండరాయితో దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలు పాలైన కాశప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఎవరికీ అనుమానం రాకుండా కాశప్ప భార్య తన భర్తను ఎవరో హత్య చేశారంటూ ఫిబ్రవరి 3 తేదీన పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పాడి, హత్య కేసును చేధించేపనిలో పడ్డారు. తీరా భార్యనే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందని పోలీసులు తెలుసుకున్నారు. తామే హత్య చేసినట్లు పోలీసులకు తెలియడంతో భార్యతో పాటు ప్రియుడు, ఆయన స్నేహితుడు పరారయ్యారు.
దీంతో సీఐ శేఖర్, ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం నిందితులను ఆర్డీటీ స్టేడియం వద్ద అరెస్టు చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానం ముందు హాజరపరిచారు. నిందితులకు రిమాండ్ విధించడంతో జైలుకు పంపినట్లు సీఐ శేఖర్ తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కాశప్ప కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)