Honor Killing: చిత్తూరు జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తెను కన్నవారే పొట్టన పెట్టుకున్నారు. దళిత యువకుడిని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు నమ్మకంగా పుట్టింటికి తీసుకు వెళ్లి ఆమెను హతమార్చారు. చిత్తూరు పట్టణంలో జరిగిన పరువు హత్య ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యువతిని బలిగొన్న తండ్రి, సోదరుడు పరారయ్యారు.
చిత్తూరు పట్టణంలో పరువు హత్య జరిగింది. దళిత యువకుడిని పెళ్లి చేసుకున్నందుకు సొంత కుమార్తెను కిరాతకంగా హతమార్చారు. దళిత యువకుడితో మతాంతర వివాహాన్ని వ్యతిరేకించిన యువతి తల్లిదండ్రులు పథకం ప్రకారం ఆమెను ఇంటికి రప్పించి హత్య చేశారు. పరువు పేరుతో తన భార్యను హత్య చేశారని యువతి భర్త ఆరోపించాడు. యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితులు పరారయ్యారు.
భార్యను పుట్టింటికి పంపిన గంటలోనే హత్య చేసి మార్చురీలో శవంగా మార్చారంటూ ఆమె భర్త విలపించాడు. చిత్తూరులోని బాలాజీనగర్ కాలనీకి చెందిన షౌకత్అలీ, ముంతాజ్ దంపతులకు యాస్మిన్ భాను అనే కుమార్తె ఉంది. ఆమె ఎంబిఏ పూర్తి చేసింది. పూతలపట్టు మండలానికి చెందిన కోదండ రామ్, బుజ్జిల కుమారుడు సాయితేజ బీటెక్ చదివారు. కాలేజీలో ఉన్న రోజుల్లో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. సాయితేజ కుటుంబం పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సాయితేజతో వివాహానికి యాస్మిన్ తల్లిదండ్రులు అంగీకరించ లేదు.
యాస్మిన్ తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన ఇద్దరూ ఈ ఏడాది ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మకు రక్షణ కల్పించాలని ఫిబ్రవరి 13న తిరుపతి డీఎస్పీని ఆశ్ర యించారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి, కౌన్సెలింగ్ ఇచ్చారు. మేజర్లు కావడంతో వారి జోలికి రావొద్దని హెచ్చరించి పంపారు.
ఆ తర్వాత రెండు నెలలుగా యాస్మిన్ సాయితేల సంసారం సాపీగానే సాగుతోంది. కొద్ది రోజుల నుంచి యాస్మిన్ కుటుంబీకులు ఫోన్లు చేస్తూ ఆమె తండ్రి షౌకత్అలీకి ఆరోగ్యం సరిగా బాగోలేదని ఓసారి వచ్చి, చూసి వెళ్లాలని యాస్మిన్‌ను పదేపదే కోరుతూ వచ్చారు. దీంతో ఆదివారం ఉదయం సాయితేజ.. తన భార్యను చిత్తూరులోని గాంధీ చౌక్‌లో యాస్మిన్ సోదరుడి కారులో ఎక్కించి, పుట్టింటికి పంపాడు.
యాస్మిన్ వెళ్లిన తర్వాత సాయితేజ తన భార్యతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసినా కలవక పోవడంతో అనుమానంతో వారి ఇంటికి వెళ్లాడు. అప్పటికే యాస్మిన్ ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఇంట్లో లేదని ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉందని యాస్మిన్ కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆందోళనతో అక్కడికి వెళ్లిన సాయితేజ.. మార్చురీలో భార్య శవాన్ని చూసి బోరున విలపించారు.
తమ మతాలు, కులాలు వేరు కావడంతో యాస్మిన్ తల్లిదండ్రులు తమ పెళ్లిని వ్యతిరేకించారని, చివరకు తన భార్యను చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సాయితేజ కన్నీరు మున్నీరుగా విలపించాడు. యాస్మిన్ తండ్రి షౌకత్, ఆమె పెద్దమ్మ కొడుకు లాలూ పరారయ్యారు. చిత్తూరు ఇన్చార్జి డీఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సంబంధిత కథనం