ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదుపై ఏమి చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించారు. పీవీ.సునీల్ కుమార్ మీద ఆయన భార్య ఫిర్యాదు ఆధారంగా గృహహింస చట్టం కింద కేసు నమోదైందని, ఆ కేసులో తెలంగాణ పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారని ఏప్రిల్ 8న రఘురామకృష్ణం రాజు హోంశాఖకు ఫిర్యాదు చేశారు. త్వరలో పీవీ.సునీల్‌కుమార్ మీద ఉన్న అభియోగాలపై విచారణ ప్రారంభమవుతుందని, అలాంటి నేపథ్యం ఉన్న సునీల్‌కు మహిళల భద్రతకు సంబంధించిన దిశ చట్ట పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగించడమంటే మహిళల హక్కుల్ని కాలరాయడమేనని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని రఘురామ కోరారు.
పీవీ.సునీల్ కుమార్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని, కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా వేధిస్తున్నారని ఆయన మాట కోర్టుకు ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని భార్య తరపు కుటుంబ సభ్యుల్ని హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు చేశారు.
సర్వీస్ నిబంధనలకు విరుద్దంగా అంబేడ్కర్ ఇండియా మిషన్ ఏర్పాటు చేసి భారీగా విరాళాలు స్వీకరిస్తున్నారని, ఈ అంశంపై తగిన దర్యాప్తు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు ఫిర్యాదుపై ఏమి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఏపీ ప్రభుత్వాన్ని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
సంబంధిత కథనం
టాపిక్