AP Home Minister: వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై హోమ్‌ మంత్రి అనిత ఫైర్‌, రాప్తాడు పర్యటనలో జగన్ వ్యాఖ్యలపై వివాదం-home minister anita fires at ysrcp president jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Home Minister: వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై హోమ్‌ మంత్రి అనిత ఫైర్‌, రాప్తాడు పర్యటనలో జగన్ వ్యాఖ్యలపై వివాదం

AP Home Minister: వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై హోమ్‌ మంత్రి అనిత ఫైర్‌, రాప్తాడు పర్యటనలో జగన్ వ్యాఖ్యలపై వివాదం

Sarath Chandra.B HT Telugu

AP Home Minister: ఏపీ మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డిపై హోమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు పర్యటనలో జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే ఘర్షణలు సృష్టించేలా కుట్రలు పన్నారని అనిత ఆరోపించారు. రాప్తాడులో జగన్ భద్రత కోసం 1100మంది పోలీసులను నియమించినట్టు చెప్పారు.

ఏపీ హోమ్‌ మంత్రి వంగలపూడి అనిత

AP Home Minister: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు 11 సీట్లతో తీర్పిచ్చినా సిగ్గు రాలేదా అంటూ ఫైర్ అయ్యారు. గతంలో ఐపీసీ కన్నా వైసీపీ కోడ్ అమలైందన్నారు. రాప్తాడు నియోజకవర్గానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి అక్కడి పరిస్థితుల దృష్ట్యా 1100 మంది పోలీసులతో రక్షణ ఇచ్చామన్నారు.

250 మంది పోలీసులు హెలిపాడ్ వద్ద ఉన్నారని తెలిపారు. వీఐపీని తీసుకువెళ్లడానికి వీలుకాని హెలికాప్టర్ 15 నిమిషాల్లో ఎలా ఎగిరి వెళ్లిందని ప్రశ్నించారు. ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని అనిపిస్తోందని... వీటన్నింటి పైన విచారణ కొనసాగుతుందని తెలిపారు.

జగన్‌ మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు లా అండ్ ఆర్డర్ లేదు అంటున్నారని.. గతంలో చంద్రబాబు బయటికి రాకుండా అడ్డుకున్నారని.. ఎయిర్‌‌పోర్టుల్లో గుండాలను పెట్టి, అడ్డుకున్నారని గుర్తుచేశారు. పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయించారని.. ఇలాంటివన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.

కస్టోడియల్ టార్చర్ అనేది జగన్మోహన్ రెడ్డి సంస్కృతి అని.. తమది కాదని స్పష్టం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినందుకు తమ మీద అనేక మంది మీద కేసులుపెట్టారన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇవ్వాలని.. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పారు. ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ భద్రత ఇస్తున్నామని వెల్లడించారు.

బట్టలు ఊడదీస్తామనడంపై అభ్యంతరం

పోలీసుల బట్టలు ఊడదీస్తామంటూ మాట్లాడే పద్ధతి సరియైనదేనా అని అనిత ప్రశ్నించారు. వైసీపీ హయాంలో 2526 హత్యలు జరిగాయని.. అక్కడికి వెళ్తామన్నా కూడా.. తాము ప్రొటెక్షన్ ఇస్తామని తెలిపారు. ఎవరైనా పోలీస్ డిపార్ట్‌మెంట్ మీద శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడినా, పోస్టులు పెట్టినా తగిన విధంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

భద్రతా వైఫల్యం ఆరోపణలపై హోం మంత్రిగా తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ స్వయంగా మీటింగ్ పెట్టి.. పార్టీ నిర్ణయాన్ని, ప్రభుత్వం నిర్ణయాన్ని గౌరవించాలని.. ఎవరు బయటకు రావద్దని పిలుపునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా హోంమంత్రి అనిత గుర్తు చేశారు.

జగన్ టూర్ ఓ డ్రామాని తలపించిందని, ఏదో రకంగా శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 12.42 కి రోడ్డు మార్గం కన్ఫర్మ్ అయితే కొద్ది నిమిషాల్లో చాపర్ బయలుదేరిపోయిందని, ఇదంతా క్రిమినల్ లీడర్ ఫ్రీ ప్లాన్‌గా చేశారన్నారు. జగన్ మాట్లాడుతుంటే వైసీపీ 5 ఏళ్ల జగన్ అరాచక పాలన గుర్తుకొచ్చిందని, చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన జనాలు మర్చిపోలేదన్నారు.

రాప్తాడులో మాజీ సీఎం జగన్‌ వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అభ్యతంరం తెలిపింది. జగన్ వ్యాఖ్యల్ని ఉపసంహకరించుకుని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం