Telugu News  /  Andhra Pradesh  /   Holidays Cancelled For Ward Secretariat Employees To Collect User Charges Dues In Urban Local Bodies
గ్రామ సచివాలయం
గ్రామ సచివాలయం

No Leaves for employee: యూజర్‌ ఛార్జీలు వసూలు కోసం సచివాలయాల్లో సెలవులు రద్దు

06 February 2023, 8:56 ISTHT Telugu Desk
06 February 2023, 8:56 IST

No Leaves for employee: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు సెలవులను రద్దు చేస్తూ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదం అవుతోంది.

No Leaves for employee: యూజర్‌ ఛార్జీల బకాయిలు పేరుకుపోవడం సచివాలయ ఉద్యోగుల సెలవులకు ఎసరు తెచ్చింది. ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు ఛార్జీలు ఖచ్చితంగా వసూలు చేయాలంటూ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల సాధారణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఈ తరహా ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేస్తారని చెబుతుండటంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఆర్థిక సంవత్సరం చివరికి వస్తుండటంతో మార్చి 31లోగా నూరు శాతం బకాయిలను వసూళ్లు చేయాలని, అప్పటి వరకు దాదాపు 59 రోజుల పాటు ఉద్యోగులకు అన్ని రకాల సెలవులను రద్దు చేస్తున్నట్లు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. నిర్ధేశించిన లక్ష్యాలను సాధించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్వర్వుల్లో హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో మొత్తం పట్టణ పురపాలిక సంస్థలు 40వరకు ఉన్నాయి. వాటిలో యూజర్ ఛార్జీలు దాదాపు రూ.263.27కోట్ల వరకు వసూలు కావాల్సి ఉండగా , ఇప్పటి వరకు రూ.93.32కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 33.32శాతం మాత్రమే వసూలు కావడంపై రాష్ట్ర ప్రభుత్వం నూరు శాతం వసూలు చేయాలని టార్గెట్ విధించింది. ఇందుకోసం ఉద్యోగులకు సెలవులు రద్దు చేసి మరి పన్ను వసూళ్ళు చేయాలని ఆదేశిస్తోంది.

ఉద్యోగులకు అత్యవసరమైతే ఎగ్జిక్యూటివ్‌ అథారిటీ దృష్టికి తీసుకెళ్లి సెలవు తీసుకోవచ్చని ఉత్తర్వులలో పేర్కొనుప్పటికీ అది అందరికీ సాధ్యం కాదని ఉద్యోగులు చెబుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థల్లో యూజర్‌ ఛార్జీల బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలాఖరు వరకు ఇదే విధానాన్ని అమలు చేయనున్నారని సమాచారం.

అయా మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడికక్కడ ఉత్తర్వులు జారీ కానున్నాయి. అన్ని పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో యూజర్‌ చార్జీలకు సంబంధించి మునిసిపల్‌ శాఖ రాష్ట్ర స్దాయిలో గతనెల 18న సమీక్షా సమావేశం నిర్వహించింది. ఉద్యోగులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో నాటి సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

2022-23 సంవత్సరానికి సంబందించి ప్రతి వార్డు సచివాలయం పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్‌, నీటి పన్ను, చెత్తపన్ను, నీటి మీటర్లకు సంబంధించిన యూజర్‌ చార్జీలతో పాటు ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌‌లను నూరు శాతం వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. తాజా ఉత్తర్వుల్లోనూ అదే విషయం పేర్కొన్నట్లు తెలుస్తోంది.

యూజర్ ఛార్జీల వసూళ్లకు సంబందించి రెవెన్యూ ఇనెస్పెక్టర్లు, వార్డు సచివాలయ అడ్మిన్‌ సెక్రటరీలు, ఇన్‌డోర్‌, ఔట్‌డోర్‌ సిబ్బంది, క్యాష్‌ కౌంటర్లలో పనిచేసే సిబ్బందికి విజయవాడలో ఇప్పటికే సెలవులు రద్దు చేశారు. అవసరమైతే సచివాలయంలోని ఇతర సిబ్భందిని కూడా వసూళ్ల కోసం వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. రెండు నెలల పాటు ఉద్యోగులకు అన్ని రకాల సెలవులు రద్దు చేయడం, చిరుద్యోగులను మానసికంగా వేధించడమేనని వాపోతున్నారు.