Teacher Rapes Student: ఏలూరులో దారుణం.. విద్యార్ధిని పెళ్లాడిన టీచర్, అత్యాచారం
Teacher Rapes Student: ఏలూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పదో తరగతి విద్యార్ధినిని ప్రేమ పేరుతో అపహరించి ఓ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదు చేశారు.
Teacher Rapes Student: విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. కూతురు వయసున్న విద్యార్ధినిని ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పి అపహరించాడు. హోటల్‌కు తీసుకెళ్లి తాళి కట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చే ఘటన ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది.
విద్యార్థిని మెడలో తాళి కట్టి పెళ్లై పోయిందంటూ అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది. భీమవరం గ్రామీణ మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమరాజు జిల్లాలోని ఉండి మండలంలోని యండగండి గ్రామంలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
తరగతి గదిలో పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై కన్నేసి ప్రేమ పేరుతో మోసగించాడు. బాలికను కిడ్నాప్ చేసి స్వగ్రామానికి తీసుకెళ్లి హోటల్ గదిలో ఆమెకు తాళి కట్టి పెళ్లైందని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని విద్యార్ధినిని నమ్మించిన పురెళ్ల సోమరాజు, ఈ నెల 19న బాలికను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని తన స్వగ్రామం తాడేరుకు తీసుకెళ్లారు. అక్కడే ఆమెకు తాళి కట్టి ఇద్దరికి పెళ్లైందని చెప్పారు.
ఆ తర్వాత బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కనిపించక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక అచూకీ తెలుసుకున్న తల్లిదండ్రులు విషయం తెలుసుకుని దిగ్బ్రాంతికి గురయ్యారు. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు సోమరాజుపై అత్యాచారం, ఫోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేసు దర్యాప్తు కోసం దిశ డీఎస్పీ ఎన్. మురళీకృష్ణను నియమిస్తూ ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారని ఆకివీడు సీఐ కె.సత్యనారాయణ వివరించారు. పాఠశాల విద్యార్ధినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడటం జిల్లాలో సంచలనం సృష్టించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.