Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత, భారీగా మొహరించిన పోలీసులు-high tension on nagarjuna sagar project ap police is trying to release water ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత, భారీగా మొహరించిన పోలీసులు

Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత, భారీగా మొహరించిన పోలీసులు

Sarath chandra.B HT Telugu
Nov 30, 2023 06:14 AM IST

Nagarjuna Sagar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ అనూహ్యంగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును ఏపీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

నాగార్జునసాగర్‌పై మొహరించిన ఏపీ పోలీసులు
నాగార్జునసాగర్‌పై మొహరించిన ఏపీ పోలీసులు

Nagarjuna Sagar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద అనూహ‍్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్‌ మీదకు భారీగా ఏపి పోలీసులు చేరుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వినియోగంలో వివాదాలు తలెత్తుతున్న సమయంలో ఈ పరిణమాలు చోటు చేసుకున్నాయి.

yearly horoscope entry point

సాగర్ నుండి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు సిద్ధం కావడంతో అడ్డుకునేందుకు తెలంగాణ అధికారులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం సాయంత్రం నుంచి గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో భారీగా ఏపిఎస్పీ పోలీసులు మొహరించారు. అర్థరాత్రి సమయంలో సాగర్ డ్యామ్‌ వెళ్లిన ఏపీ పోలీసులు 13వ నంబర్ గేటు వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు.

డ్యామ్‌ పరిసరాల్లో జరుగుతున్న పరిణామాలను పరిశీలించేందుకు వెళ్లిన మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. అర్థరాత్రి సమయంలో దాదాపు 700మంది పోలీసులు సాగర్ డ్యామ్‌పైకి చేరుకున్నారు. వారిని అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు బలగాలు మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

డ్యామ్‌పై భారీగా పోలీసుల మొహరింపు..

ఈ ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండటంతో ఈ ఏడాది కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. మరోవైపు డ్యామ్‌ ఆపరేషన్ బాధ్యత మొత్తం తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సాగు, తాగు నీటికి కృష్ణా డెల్టాలో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగు, తాగు నీరు అందడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తాగు, సాగు నీరు అందక గుంటూరు, పల్నాడు రైతాంగం కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నీటి విడుదలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో సాగర్‌ నీటిని విడుదల చేసే ఉద్దేశంతో ఏపీ పోలీసులు డ్యామ్‌పైకి చేరినట్టు చెబుతున్నారు. అర్థరాత్రి సమయంలో డ్యామ్‌పై విద్యుత్‌ సరఫరా నిలిపివేసి, అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. నాగార్జునసాగర్‌ డ్యామ్‌ 13వ నంబర్‌ గేట్‌ వరకు దూసుకెళ్లారు.

ప్రాజెక్టు మీదకు చేరేందుకు ప్రయత్నించిన పోలీసులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న మీడియా ప్రతినిధులపై పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధుల ఫోన్లను ఏపీ పోలీసులు లాక్కున్నారు.

ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు సుమారు 700 మంది పోలీసు సిబ్బందితో సాగర్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అడ్డుకున్న డ్యామ్‌ ఎస్పీఎఫ్‌ సిబ్బందిపై దాడి చేసి మొబైల్‌ ఫోన్లను లాక్కున్నారు. డ్యామ్‌ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం వారు 13వ గేట్‌ వద్దకు చేరుకొని ముళ్ల కంచెను ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్‌పైకి చేరుకొని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్‌కు సంబంధించి నిర్వహణ విషయం నీటి పారుదలకు సంబంధించినదని, ముళ్లకంచెను తీసేయాలని ఏపీ పోలీసులకు సూచించారు. ఏపీ పోలీసులు స్పందించకపోవడంతో తన సిబ్బందితో ఆయన వెనుదిరిగి వెళ్లారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఏపీ పోలీసు ఉన్నతాధికారులు సాగర్ వద్దకు చేరుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర విభజనలో భాగంగా నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పటి వరకు నీటి విడుదల, భద్రతా విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంది. తెలంగాణలో ఎన్నికల హడావుడి జరుగుతున్న వేళ జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

కుట్రలో భాగమే…

మరోవైపు నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద జరుగుతున్న పరిణామాలు రాజకీయ కుట్రలో భాగంగానే జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెంటిమెంట్‌ రెచ్చగొట్టి లాభపడే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఘర్షణలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు. వివాదాలతో రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Whats_app_banner