AP HC On Lands Issue: పేదలకు ఇళ్లపై మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరించిన ఏపీ హైకోర్టు
AP HC On Lands Issue: రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఉత్తర్వులపై అభ్యంతరముంటే సుప్రీం కోర్టును ఆశ్రయించొచ్చని పిటిషనర్లకు తేల్చి చెప్పింది.
AP HC On Lands Issue: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సమీకరించిన భూముల్లో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు 1,134 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు బదలాయిస్తూ ఇచ్చిన జీవోపై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టంచేసింది. భూములను కలెక్టర్లకు బదలాయించారే తప్ప, లబ్ధిదారులకు కేటాయించలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ మంతోజ్ గంగారావుతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. భూముల కేటాయింపు అపరిపక్వ దశలో ఉందని, సరైన కారణం ఉత్పన్నం కాకుండానే పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని అభిప్రాయపడింది.
ట్రెండింగ్ వార్తలు
'రాజధాని అమరావతి, ఆ ప్రాంత అభివృద్ధి అందరిదని, దానిని పిటిషనర్లు అడ్డుకోలేరని, ఫలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని పిటిషనర్లు అభ్యంతరం చెప్పడం తగదన్నారు. ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్నీ సవాలు చేస్తున్నారని పిటిషనర్లపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. భూముల కేటాయింపు వ్యవహారంలో జోక్యం చేసుకుని వ్యవహారాన్ని జటిలం చేయలేమన్నారు.
కొన్ని అంశాలపై హైకోర్టులో, మరికొన్నింటిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్నారని, . ఈ విషయంలోనూ సుప్రీంకోర్టునే ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది. జీవో 45పై మధ్యంతర ఉత్తర్వులిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని పురపాలక, రెవెన్యూ శాఖలతో పాటు సీఆర్‌డీఏ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ వేశాక అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులిచ్చే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది. మంగళవారం ఈ ఆదేశాలిచ్చింది.
రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలో 1,134 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్‌కు 550.65 ఎకరాలు, ఎన్టీఆర్ కలెక్టర్‌కు 583.93 ఎకరాలు భూబదలాయింపు చేయడానికి సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతులిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి మార్చి 31న జీవో 45 జారీచేశారు. దీన్ని ప్రశ్నిస్తూ రాజధాని ప్రాంత రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఇవి ప్రజాహిత వ్యాజ్యాలా అని ప్రశ్నించిన కోర్టు…
హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. సీఆర్‌డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందాన్ని హైకోర్టు సమర్థించిందని, సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని స్టేటస్ కో ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. 'ఈ వ్యాజ్యాలేమీ ప్రజాహిత వ్యాజ్యాలు కాదని అబిప్రాయపడింది. ప్రభుత్వ జీవోతో పిటిషనర్ల హక్కు ఎలా ప్రభావితం అవుతున్నారని ప్రశ్నించింది. వ్యక్తిగత అభ్యంతరంతో జీవో మొత్తాన్ని రద్దు చేయాలని కోరడం సరికాదని, ఒత్తిడి చేసి మధ్యంతర ఉత్తర్వులు పొందలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.