AP High Court Notices: కౌలు చెల్లింపుపై సిఆర్‌డిఏకు హైకోర్టు నోటీసులు
AP High Court Notices: ఆంధ‌్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం అమరావతిలో భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించడంలో జాప్యం చేయడంపై ఏపీ ప్రభుత్వానికి, సిఆర్‌డిఏకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ ఫూలింగ్ విధానాలకు విరుద్ధంగా జాప్యం జరుగుతుండటంపై రైతులు కోర్టును ఆశ్రయించారు.
AP High Court Notices: రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏపై ఉందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. భూ సమీకరణ ఒప్పందాల ప్రకారం రైతులకు కౌలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
ట్రెండింగ్ వార్తలు
రైతులకు కౌలు డబ్బులు చెల్లించేందుకు ఏ చర్యలు తీసుకున్నారో తెలియ జేయాలని ఆదేశాలు జారీచేసింది. కేసు విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ వి.సుజాతతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకుఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించకపోడంతో అమరావతి రాజధాని భూ సమీకరణ రైతు సమాఖ్య సంయుక్త కార్యదర్శి కల్లం రాజశేఖర్‌రెడ్డి, రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
ఈ పిటిషన్లపై ఆగస్టు 22న విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌జడ్జి.. ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. సింగల్ జడ్జి ఉత్తర్వులపై పిటిషనర్లు ధర్మాసనం ముందు అప్పీలు వేశారు. సోమవారం జరిగిన విచారణలో ధర్మాసనం పలు అంశాలను లేవనెత్తింది. సింగిల్ జడ్జి ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలు దాఖలు చేయవచ్చా అని సందేహం వ్యక్తంచేసింది.
ఈ తరహా పిటిషన్లను అనుమతిస్తే ఇదే తరహా అప్పీళ్ల దాఖలు అవుతాయని, వాటికి అంతు లేకుండా పోతుందని అభిప్రాయపడ్డారు. అత్యవసరంగా అప్పీలు వేయడానికి నిర్మాణాల కూల్చివేత వ్యవహారం కాదు కదా అని ప్రశ్నించింది. పిటిషనర్ల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు.. తాము దాఖలుచేసిన అప్పీలుకు విచారణ అర్హత ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును చదివి వినిపించారు.
రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఏటా మే 1లోపు వార్షిక కౌలు చెల్లించాల్సిన చట్టబద్ధ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏపై ఉందని వివరించారు. ఇప్పటివరకు కౌలు చెల్లించకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సీఆర్‌డీఏ తరఫున ఎస్‌జీపీ కాసా జగన్‌మోహన్‌రెడ్డి రైతుల తరఫున దాఖలైన అప్పీలుకు విచారణ అర్హత లేదని వాదించారు. సీఆర్‌డీఏ, రైతుల మధ్య ఒప్పందంలో రైతు సంఘాలు వ్యాజ్యం దాఖలు చేయడంపై అభ్యంతరం ఉందన్నారు. ఈ క్రమంలో ధర్మాసనం స్పందిస్తూ.. 'భూములిచ్చిన రైతులకు చట్టబద్ధంగా వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభఉత్వంపై ఉందా లేదా అని ప్రశ్నించింది. రైతులకు సొమ్ము చెలించేందుకు ఏమి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. పిటిషన్ విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది.