APHC YS Sunitha: సునీత, రాజశేఖర్‌, సిబిఐ ఎస్పీ రాంసింగ్‌ క్వాష్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు-high court dismisses sunitha rajasekhar cbi sp ramsingh quash petitions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Aphc Ys Sunitha: సునీత, రాజశేఖర్‌, సిబిఐ ఎస్పీ రాంసింగ్‌ క్వాష్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

APHC YS Sunitha: సునీత, రాజశేఖర్‌, సిబిఐ ఎస్పీ రాంసింగ్‌ క్వాష్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

Sarath chandra.B HT Telugu
May 10, 2024 02:06 PM IST

APHC YS Sunitha: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంలో వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందులలో నమోదైన కేసులు కొట్టేయాలని దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది.

సునీత, వైఎస్ వివేకా
సునీత, వైఎస్ వివేకా

APHC YS Sunitha: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో పిఏ కృష్ణారెడ్డిని బెదిరించారనే ఆరోపణలపై పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని వైఎస్‌ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది.

వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో గతంలో పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్‌ అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ఒత్తిడి చేశారంటూ, ఈ క్రమంలో తనను వేధించారని గతంలో పోలీసులకు కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు.

కృష్ణారెడ్డి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు, తమపై నమోదైన కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సునీత, రాజశేఖర్‌రెడ్డి, రాంసింగ్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు వాటిని కొట్టేసింది.

మరోవైపు వివేక హత్యపై నా పోరాటం వ్యక్తిగతమే కాదని సునీత అన్నారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలపై కూడా తాను పోరాడుతున్నానని చెప్పారు. వివేకా హత్య కేసు వ్యక్తిగతం అయితే కిరాయి రౌడీలతో ప్రత్యర్థులను లేపేసేదాన్నని అన్నారు.

స్థానిక పోలీసుల విచారణ ఆధారంగానే సీబీఐ కూడా దర్యాప్తు కొనసాగించిందని, సీబీఐ దర్యాప్తును జగన్ అడ్డుకుంటాడని కారణంతోనే సుప్రీంకోర్టు కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసిందన్నారు. కేసును తప్పుదారి పట్టించేందుకు నన్ను ప్రోత్సహిస్తున్నారని ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు, సీఎం రమేష్ పేర్లను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు.

వివేకాను జగన్ ఓ మనిషిలా కూడా గుర్తించలేదని, జగన్ వెంట నడిచిన వివేకాను అవినాష్ చంపిస్తే న్యాయం ఎందుకు చేయడం లేదని వైఎస్ సునీత ప్రశ్నించారు.