సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. 42 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత పలు అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. రాజధాని అమరావతిలో చేపట్టనున్న మలివిడత భూ సమీకరణపై మంత్రివర్గ సమావేశం చర్చించింది. తొలి విడత భూ సమీకరణకు వర్తించినట్టుగా మలివిడత భూ సమీకరణకు నిబంధనలు వర్తింపచేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏడో ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28వేల 546 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వైజాగ్‌లో కాగ్నిజెంట్‌కు సంబంధించి చర్చ జరిగింది. 22 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం లభించంది. రూ.1582 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే కాగ్నిజెంట్ ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
అమరావతిలో పరిపాలనా భవన నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు ఆమోదం లభించింది. రూ.882 కోట్లతో జీఏడీ టవర్, రూ.1148 కోట్లతో హెచ్ఓడీ కార్యాలయాలు, రూ.1303 కోట్లతో ఇతర భవనాల నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న సంస్థలకు కేబినెట్ అనుమతులు ఇచ్చింది. కుప్పం నియోజకవర్గంలో నీటి వనరులకు సంబంధించి.. 51 పనులకు పరిపాలనా అనుమతులు లభించాయి.
అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1052 కోట్లతో టెండర్ పిలిచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీడ్ యాక్సెస్ రోడ్‌ను నేషనల్ హైవే 16కు కలిపేందుకు 682 కోట్లతో టెండర్లు పలిచేందుకు ఆమోదం దక్కింది. దీనితోపాటుగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.
సంవత్సరంలోగా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ విషయంపై తనతో ఎన్నిసార్లైనా మాట్లొడొచ్చన్నారు. మరోవైపు కూటమి ఏడాది విజయాలను ఎమ్మెల్యేలు జూలై 1 నుంచి ఇంటింటికీ తీసుకెళ్లే కార్యాచరణ రూపొందించామన్నారు.
పోలవరం బనకచర్ల అనుసుంధాన ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలని చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకో ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. పక్క రాష్ట్రానికి ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలని చెప్పారు. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారని, అయినా అభ్యంతరం చెప్పలేదన్నారు చంద్రబాబు. నేతలు అందరూ ఈ ప్రాజెక్టుపై మాట్లాడాలని చెప్పారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అసరం మంత్రులు, నేతలపై ఉందని అన్నారు.