Vijayawada Highway : ఏపీ నుంచి తెలంగాణకు మొదలైన వాహనాల రద్దీ.. భారీగా ట్రాఫిక్ జామ్
Vijayawada Highway : ఏపీ నుంచి తెలంగాణకు వాహనాలు క్యూకట్టాయి. ముఖ్యంగా విజయవాడ- హైదరాబాద్ హైవేపై రద్దీ ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వెహికిల్స్ నెమ్మదిగా కదులుతున్నాయి. వేగంగా పంపడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ కంటైనర్ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఏపీ నుంచి తెలంగాణకు వాహనాల రద్దీ మొదలైంది. నందిగామ కీసర, జగ్గయ్యపేట చిళ్లకల్లు టోల్ గేట్ల దగ్గర వాహనాల తాకిడి భారీగా పెరిగింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణాలతో రద్దీ బాగా పెరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైవేపై రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి ఆర్చ్‌లో భారీ కంటైనర్ ఇరుక్కుపోయింది. దీంతో 4 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.

టోల్‌గేట్ల వద్ద..
టోల్‌గేట్ల దగ్గర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వేగంగా పంపేలా పోలీసులు చర్యలు చేపట్టారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు ఏపీకి వెళ్లారు. సంక్రాంతి సంబరాలు ముగియడంతో.. మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యారు. సొంత వాహనాలు, బస్సులు, రైళ్లలో హైదరాబాద్‌కు వెళ్తున్నారు.
బస్సులు ఫుల్లు..
సొంత వాహనాలు లేనివారు ఎక్కువగా బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఏలూరు బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. రద్దీకి తగ్గట్టు అధికారులు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం నగరాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.
రైళ్లలో రద్దీ..
ప్రయాణికులతో ప్రధాన రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి రైల్వే స్టేషన్లలో రద్దీ బాగా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లే రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. దీంతో చాలామంది జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నారు. సాధారణ కోచ్‌లు పెంచాలని రైల్వే అధికారులను కోరుతున్నారు. ఇప్పటికే పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జల చేశారు.
భాగ్యనగరంలో ట్రాఫిక్ జామ్..
సంక్రాంతికి వెళ్లి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కావడంతో.. భాగ్యనగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్, జేబీఎస్, అమీర్‌పేట మెట్రో స్టేషన్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాల రద్దీ పెరగడంతో.. ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. రద్దీని క్లియర్ చేస్తున్నారు.