తీరం దాటనున్న వాయుగుండం...! ఏపీలో ఇవాళ భారీ వర్షాలు, తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు-heavy rains likely in andhra today due to the influence of a cyclonic storm ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తీరం దాటనున్న వాయుగుండం...! ఏపీలో ఇవాళ భారీ వర్షాలు, తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు

తీరం దాటనున్న వాయుగుండం...! ఏపీలో ఇవాళ భారీ వర్షాలు, తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం… వాయుగుండంగా బలపడింది. ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తీరం దాటే సమయంలో… తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఏపీకి భారీ వర్ష సూచన

వాయువ్య మరియు దానికి ఆనుకుని ఉన్న మధ్యబంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం… వాయుగుండంగా మారింది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వాయువ్య మరియు దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వద్ద వాయుగుండంగా బలపడిందని ఐఎండీ తెలిపింది.

వాయుగుండం దాదాపు పశ్చిమం వైపు కదులుతూ ఇవాళ(సెప్టెంబర్ 27) ఉదయం గోపాల్‌పూర్‌కు దగ్గరగా దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఇవాళ కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.

పొంగిపోర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇవాళ భారీ వర్షాలు…

ఇవాళ రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఇక శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విజయనగరంలో 58.7 మిమీ, శ్రీకాకుళం(జి) ఆమదాలవలసలో 54 మిమీ, శ్రీకాకుళంలో 48.7 మిమీ వర్షపాతం నమోదైంది. విజయనగరం(జి) నెల్లిమర్లలో 42.7 మిమీ, డెంకాడలో 42.7 మిమీ, ప్రకాశం(జి) పెద్దారవీడులో 42 మిమీ చొప్పున వర్షపాతం నమోదు అయింది.

పెరుగుతున్న వరద ప్రవాహం…

మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి కృష్ణానది వరద ప్రకాశం బ్యారేజి వద్ద 2.39 లక్షల క్యూసెక్కులు, గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 44.7 అడుగుల నీటిమట్టం, ధవళేశ్వరం వద్ద 5.34 లక్షల క్యూసెక్కులు ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.

వివిధ ప్రాజెక్టుల్లో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద హెచ్చుతగ్గులను గమనిస్తూ నది పరీవాహక ప్రాంత గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం