AP Weather Update: కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం
AP Weather Update: ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది.
AP Weather Update: ఏపీలోని కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మూడ్రోజుల పాటు వానలు కొనసాగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల బుధవారం భారీ వర్గాలు కురిసే అవకాశం ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఏకదాటిగా వర్షంకురుస్తోంది. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, కృష్ణా, పార్వ తీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తిరుపతి, నంద్యాల, కర్నూలు, విజయనగరం, వైఎస్సార్ తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాత్రి 8 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవ లసలో 55, 75 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
సాగర్ నుంచి పులిచింతలకు…
నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలు పెద్ద మొత్తంలో వస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టు సగం నిండింది. శ్రీశైలం నుంచి సాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి, ప్రకాశం బ్యారేజికి నీటిని విడుదల చేస్తున్నారు.
పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలుకాగా దాదాపు 30టిఎంసీలకు చేరువలో నీటి నిల్వ ఉంది. దీంతో లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో పూర్తి స్థాయి నీటి మట్టం ఉండటంతో 60వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
మరోవైపు సాగర్ ఆయకట్టుకు నీరందించే కుడి ఎడమ కాల్వలకు నీటి విడుదలను పెంచారు. కుడి కాల్వకు 8,144 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,193 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.71 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా వచ్చిన నీటిని కిందకు వదిలేస్తున్నారు.
సాగర్‌కు ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరగడంతో 22 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడు దల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో సాగర్ చేరుకుంది. సాగర్ నుంచి దిగువకు మూడున్నర లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.