AP Weather ALERT : బలహీనపడిన అల్పపీడనం..! ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, ఐఎండీ హెచ్చరికలు
Rains in Andhrapradesh : ఏపీకి ఐఎండీ కీలక అప్టేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. రేపు(నవంబర్ 14) కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వరికోతల విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
నైరుతి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడిందని వాతావరణశాఖ తెలిపింది. అయినప్పటికీ ఏపీలో రేపు(నవంబర్ 14) కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈనెల 15, 16 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఐఎండీ అంచనాల ప్రకారం… ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది. వర్షాల నేపథ్యంలో వరికోతలు,ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని,ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలని కోరింది.
ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన…
రేపు(నవంబర్ 14) కృష్ణా,గుంటూరు,బాపట్ల,ప్రకాశం,నెల్లూరు,అనంతపురం, సత్యసాయి,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి,కోనసీమ,పగో,ఏలూరు,పల్నాడు,నెల్లూరు,కర్నూలు, నంద్యాల,వైఎస్ఆర్,అన్నమయ్య,చిత్తూరులో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణలో ఇలా…
నిన్నటి వరకు తెలంగాణలో పొడి వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. అయితే అల్పపీడన ప్రభావంతో ఇవాళ్టి (నవంబర్ 13) నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడకక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
నవంబర్ 16వ తేదీ వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని తాజా బులెటిన్ లో తెలిపింది. నవంబర్ 17వ తేదీ నుంచి మళ్లీ తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని అంచనా వేసింది. ఇక హైదరాబాద్ లో చూస్తే... ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. ఉపరితల గాలులు ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉందని వెల్లడించింది.